Live: బెంగళూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. ప్రత్యక్ష ప్రసారం
Published: May 21, 2023, 11:21 AM

దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం వందచోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించగా.. ఈ రోజు బెంగళూరులో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని వసంత్‌నగర్ అంబేడ్కర్ భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాలు, అభిమాన సంఘాలు, ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు.
శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో జై ఎన్టీఆర్ వెబ్ సైట్‌ను, ప్రత్యేక సంచికను ముఖ్య అతిథి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. శక్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ - మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్ మైదానంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్‌కు దేశ, విదేశాల్లో ఘన నివాళులు అర్పిస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని తెలియజేప్పారు. లంచాలు నచ్చక ఉద్యోగానికే రాజీనామా చేసిన వ్యక్తి ఆయన అని చెప్పారు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి.. రాయలసీమలో కరవు సంభవిస్తే ఇంటింటికీ తిరిగి చందాలు అడిగిన ఆ ప్రాంతాన్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు. అలాగే ఆ మహానటుడే దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకున్నారని తెలిపారు. ఇప్పుడు అమలయ్యే అనేక కార్యక్రమాలకు ఎన్టీఆరే నాంది పలికారని టీడీపీ అధినేత వివరించారు. తెలుగు వారి ఆస్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల్లోనే మహాశక్తి దాక్కుని ఉందని ఈ సందర్భంగా వర్ణించారు.