LIVE: నంద్యాల నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
Published: May 18, 2023, 2:49 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజు నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. నంద్యాలలోని యాతాం ఫంక్షన్ హాలు వద్ద బస చేసిన లోకేశ్.. నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. మధ్యాహ్నం యాతం ఫంక్షన్ హాల్ వద్ద రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. నేటితో పాదయాత్ర 1,300 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఇందుకు గుర్తుగా నంద్యాల రూరల్ మండలం కానాల పంచాయతీలో టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు. కానాలలో జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశం కానున్నారు. హెచ్ఎస్.కొట్టాల, ఎం.చిన్నకొట్టాల, జూలేపల్లె, పసరపాడు, తెళ్లపూరి, రాయపాడు గ్రామస్థులతో సమావేశం కానున్నారు.
అదేవిధంగా బుధవారం నాడు జరిగిన పాదయాత్రలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. నారా లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చారు. లోకేశ్ వీధుల్లోకి వెళ్లి జనంతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకున్నారు. వివిధ సామాజిక వర్గాలను కలిసి మాట్లాడారు.
కాగా కొంత కాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నేడు నంద్యాలలోని ఎంఆర్ఐ సెంటర్లో స్కానింగ్ చేయించుకున్నారు. గత 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు.