LIVE హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి.. ప్రత్యక్ష ప్రసారం..
Published: Sep 18, 2023, 10:14 AM

khairatabad Ganesh 2023 Live : ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలైంది. వినాయక చవితికి ఒక రోజు ముందు నుంచే.. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా.. ఖైరతాబాద్ గణేశుడు (Khairatabad Ganesh) భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజులపాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు.
మట్టితో చేసిన ఈ మహా గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఏర్పాటుచేశారు. ఏటా మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి. భక్తులు తొలి రోజే పెద్దఎత్తున గణనాధుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.