Live: సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతుల నిరసనలు..
Published: May 26, 2023, 9:15 AM

Amravati Farmers Protest Live: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. అయితే దీనిపై అమరావతి రైతులు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చిన రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటుచేసి భూములు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అమరావతి దీక్ష శిబిరాల్లో నల్ల రిబ్బన్లు, నలుపు వస్త్రాలు, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేపట్టాలని అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. కార్యక్రమంలో రాజధాని గ్రామాల రైతులు, కూలీలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఐకాస నాయకులు కోరారు. మందడం సాయిబాబా గుడిలో అమరావతి శ్రీరామ నామ స్తూపానికి శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు సీఎం జగన్ పర్యటన దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు.. ఐకాస ముఖ్య నేతలు బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు.