Live: దళితులపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ వైఫల్యాలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
Published: May 21, 2023, 12:24 PM

వైసీపీ పాలనలో దళితులు, మైనారిటీలు, బీసీ నేతలపై దాడులు పెరిగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ వైఫల్యాలపై విజయవాడలో అఖిలపక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేనతంగా వైకాపా పాలనలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. రాజ్యాంగపరంగా లభించిన హక్కులు కూడా నేడు ఎస్సీలు పొందలేని పరిస్థితి ఉందన్నారు. ఎస్సీలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని సీఎం అంటున్నారని.. సీఎం జగన్ ముందుగా వంచించింది ఎస్సీలనే అని ఆయన అన్నారు.
దళితు బిడ్డలకు మేనమామ అని సీఎం జగన్ నిలువునా ముంచారని మాజీ జడ్జి, రామకృష్ణ ఆరోపించారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి రెండు నెలలు జైల్లో పెట్టారని... నన్ను జైల్లోనే చంపడానికి మంత్రి పెద్దిరెడ్డి కుట్ర చేశారని రామకృష్ణ అన్నారు. నూటికి 99 శాతం దళితులు జగన్ కోసం పని చేసి సీఎం కుర్చీలో కూర్చోపెట్టామని.. సీఎం అయ్యాక దళిత ప్రజల గొంతు నొక్కారన్నారు. దళితులు అంటే సజ్జలకు చులకన అని.. ఆయన రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడని అన్నారు. జగన్ను సాగనంపే సమయం వచ్చిందని రామకృష్ణ అన్నారు.