చైనాలో రాజ్యాంగ సవరణ.. శాశ్వత అధ్యక్షుడిగా జిన్​పింగ్!

author img

By

Published : Sep 12, 2022, 11:10 AM IST

xi jinping communist party

Xi Jinping communist party: మావో జెడాంగ్‌ తర్వాత చైనాలో అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్‌.. పార్టీలో, ప్రభుత్వంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెలలో జరిగే సీపీసీ ప్లీనరీ.. ఆయనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సహా, రికార్డు స్థాయిలో మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగేందుకు ఆమోదం తెలపనుంది. వచ్చే నెలలో రెండో పర్యాయం ఆయన పదవీకాలం పూర్తికానుంది.

xi Jinping communist party: వచ్చేనెలలో ఐదేళ్లకోసారి బీజింగ్‌లో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ-సీపీసీ కేంద్ర కమిటీ సమావేశాల్లో కీలక రాజ్యాంగ సవరణ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సహా రికార్డు స్థాయిలో మూడోసారి దేశాన్ని పాలించేందుకు మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అవకాశం లభించనుంది. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీలో ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన ప్రకటన తర్వాత జిన్‌పింగ్‌ మరింత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన విధానాల రూపకల్పన కమిటీ 25మంది సభ్యుల పొలిట్‌ బ్యూరో గత శుక్రవారం సమావేశమైంది. కీలక సమయంలో జరుగుతున్న20వ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ మహాసభలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నట్లు తెలిపింది. కామ్రేడ్‌ జిన్‌పింగ్‌ సారథ్యంలోని సీపీసీ కేంద్ర కమిటీ గతంలో సాధించిన విజయాల ఆధారంగా మొత్తం పార్టీ, దేశ ప్రజలను ఏకం చేయటంతోపాటు దేశానికి నాయకత్వం వహించాలని సీపీసీ పొలిట్‌ బ్యూరో అభిప్రాయపడింది. ఈ ప్రకటన ద్వారా సీపీసీకి జిన్‌పింగ్‌ సారథ్యం కొనసాగుతుందని కచ్చితమైన సంకేతాలు పంపింది.

చైనా దేశాధినేతగా, సీపీసీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ను కొనసాగించడమంటే నాయకత్వ బాధ్యతల విషయంలో భారీ విధానపరమైన మార్పుగా భావిస్తున్నారు. ఎందుకంటే మావో జెడాంగ్‌ తప్ప జిన్‌పింగ్‌కు ముందున్న నేతలందరూ రెండు పర్యాయాల తర్వాత పదవీ విరమణ చేశారు. మావో జెడాంగ్‌ తర్వాత కోర్‌ లీడర్‌ హోదా పొందిన జిన్‌పింగ్‌ ఈ ఏడాది చైనా దేశాధినేతగా, సీపీసీ ప్రధాన కార్యదర్శిగా రెండో పర్యాయం పదవీకాలం పూర్తి చేయనున్నారు.

జిన్​పింగ్​కు మినహాయింపు..
సీపీసీలో జిన్‌పింగ్‌ తర్వాత రెండోస్థానంలో ఉన్న చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌ తోపాటు అనేకమంది ఉన్నతస్థాయి నాయకులు రెండో పర్యాయం పదవీకాలం పూర్తి కానుండడం వల్ల.. వారు పదవీ విరమణ చేస్తారని సీపీసీ పొలిట్‌ బ్యూరో ప్రకటించింది. ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేయాల్సిందేనని కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ నిర్దేశించారు. అయితే 68 ఏళ్ల జిన్‌పింగ్‌ ఆ నిబంధన మినహాయింపు పొందునున్నారు. దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాలం పరిమితి వర్తించదని 2018లో చేసిన రాజ్యాంగ సవరణతో జిన్‌పింగ్‌ జీవితకాలం చైనా అధ్యక్షునిగా కొనసాగేందుకు మార్గం సుగమం అయింది. మరోవైపు పార్టీలో శక్తిమంతమైన పొలిట్‌ బ్యూరోలోని 25మంది సభ్యుల్లో దాదాపు సగం మందికి అక్టోబరుకల్లా 68 ఏళ్లు నిండుతాయి. వారు కూడా పదవీ విరమణ చేయనున్నారు.

చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల కేంద్ర మిలిటరీ కమిషన్‌ చైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత తొమ్మిదేళ్ల పదవీకాలంలో జిన్‌పింగ్, చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు. మావో తరవాత జిన్‌పింగ్‌ను కీలక నాయకుడిగా 2016లో ప్రకటించి పార్టీ రాజ్యాంగంలో ఆ అంశాన్ని పొందుపరిచారు. ఇది పార్టీకీ, దేశానికీ, చైనా ప్రజలకు పెద్దవరమని కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ కొనియాడింది. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైనప్పటి నుంచి జిన్‌పింగ్‌ చైనాను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారనీ, ఆయన నాయకత్వంలో చైనా నవ బలాధిక్య యుగంలో ప్రవేశిస్తోందనీ, చరిత్రగతిని మార్చే కీలక నాయకుడిగా ఆయన చరితార్ధుడయ్యారనీ అధికార వార్తా సంస్థ కీర్తించింది.

ఇవీ చదవండి: ఉక్రెయిన్‌ ఎదురుదాడులు.. పారిపోతున్న రష్యా సేనలు

పాక్​​కు అమెరికా సాయం.. భారత్​ తీవ్ర అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.