అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి.. స్కూల్లో ఫైరింగ్​లో ఇద్దరు విద్యార్థులు

author img

By

Published : Jan 24, 2023, 6:52 AM IST

Updated : Jan 24, 2023, 8:52 AM IST

us school shooting

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యయి. మరోవైపు, డెస్​ మొయిన్స్​​లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. మరో ఉపాధ్యాయుడు గాయపడ్డాడు.

లాస్‌ ఏంజెలెస్‌లో దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించిన దుర్ఘటన మరువకముందే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. యూఎస్​లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మూడు దుర్ఘటనల్లో.. ఇద్దరు విద్యార్థులు సహా తొమ్మిది మంది మరణించారు.

ఉత్తర కాలిఫోర్నియా హాఫ్ మూన్ బేలోని రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ ఫామ్‌ రైస్ టకింగ్ సోయిల్ ఫామ్‌లలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ దుర్ఘటనలపై స్పందించారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్. లాస్‌ ఏంజెలెస్‌ విషాదం నుంచి తేరుకోకముందే.. ఇంకో విషాదం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ట్వీట్ చేశారు.

పాఠశాల విద్యార్థులపై కాల్పులు
డెస్ మొయిన్స్​లోని ఓ పాఠశాలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.

"దుండగుల కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. అక్కడ ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ మరణించారు. కాల్పుల్లో గాయపడిన ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిగిన 20 నిమిషాల్లోనే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. ఘటనాస్థలికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అనుమానితుల కారును స్వాధీనం చేసుకున్నాం."

--పోలీసులు

లాస్ ఏజెంల్స్ కాల్పులు..
జనవరి 21న అమెరికాలోని లాస్​ఏంజెల్స్​లో చైనీయుల లూనార్ న్యూఇయర్​ వేడుకలు జరిపుకుంటున్నవారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 11 మంది మరణించారు. నిందితుడు చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన హు కన్‌ ట్రాన్‌(72)గా పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటన అనంతరం వ్యానులో పరారైన నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Jan 24, 2023, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.