'కవ్విస్తే పాక్​ పని అయిపోయినట్లే! ఆర్మీతోనే మోదీ బదులిస్తారు'.. అమెరికా నివేదిక

author img

By

Published : Mar 9, 2023, 7:33 AM IST

us on india pakistan conflict

పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడితే భారత్ నుంచి సైనిక చర్య ఎదురుకాక తప్పదని అమెరికా పేర్కొంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్.. ఆర్మీతోనే బదులిస్తుందని తెలిపింది. ఇంకా ఏమందంటే?

పాకిస్థాన్ నుంచి కవ్వింపులు ఎదురైతే భారత్ సైనిక చర్యతోనే సమాధానం ఇచ్చే అవకాశం ప్రస్తుతం అధికంగా ఉందని అమెరికా పేర్కొంది. గతంతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ తరహా దృక్ఫథం బలంగా ఉందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తే ఘర్షణ అత్యంత ఆందోళనకరమని నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి ఘర్షణ అయినా ఆందోళనకర పరిస్థితులకు దారి తీయొచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉగ్రవాదులకు పాకిస్థాన్ అంటకాగుతోందని కుండబద్దలు కొట్టింది.

"భారత వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చిన సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్​కు ఉంది. ఆ దేశం నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్.. సైనిక చర్యతో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సమస్యపై ఇరు వర్గాల దృష్టి కోణం వల్ల ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చుతోంది. కశ్మీర్​లో హింసాత్మక ఘర్షణలు, భారత్​లో ఉగ్రవాదుల దాడులు వంటివి సమస్యలుగా ఉన్నాయి. 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ప్రకటించిన ఈ దేశాలు.. ఇదే శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది."
-అమెరికా నిఘా సంస్థ నివేదిక

అమెరికాకు స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్న సమస్యల గురించి నివేదికలో ప్రస్తావించింది. అంతర్​రాష్ట్ర ఘర్షణలు, పలు దేశాల్లో అస్థిరత, ప్రభుత్వ పరమైన సమస్యలు అమెరికా ప్రయోజనాలకు ప్రతీకూలంగా మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 'రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగితే.. అది అన్ని దేశాలకూ నష్టం కలిగిస్తుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం మనకు తెలిసేలా చేసింది. భద్రతా పరమైన సమస్యలే కాకుండా ఆర్థిక, ప్రాంతీయ, సామాజిక అసమానతలకు ఈ ఘర్షణలు దారితీస్తాయి. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర, కరోనా మహమ్మారి.. పేదరికాన్ని మరింత పెంచాయి. ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించాయి. అసమానతలు మరింత పెరిగాయి. ప్రజాస్వామ్యం దాడికి గురై.. నియంతృత్వం పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు సైనిక ఆపరేషన్లు ఉద్ధృతం చేస్తున్నాయి. వీటి వల్ల ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉంది.' అని నివేదిక వివరించింది.

ఏంటీ నివేదిక?
వచ్చే ఏడాది కాలంలో అమెరికాకు ఏ విధమైన ముప్పు పొంచి ఉందనే విషయాలపై ఈ నివేదిక దృష్టిసారిస్తుంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులు, అమెరికాపై వాటి ప్రభావంపై అంచనా వేస్తుంది. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.