విలీనంపై పుతిన్​ త్వరలో ప్రకటన.. తర్వాత విధ్వంసమేనా?

author img

By

Published : Sep 29, 2022, 9:07 AM IST

Russia Ukraine War

Russia Ukraine War : ఉక్రెయిన్​, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఉక్రెయిన్‌ భూభాగాలను చేర్చుకుంటూ నేడో, రేపో కీలక ప్రకటన చేయనున్నారు పుతిన్​. ఈ నేపథ్యంలో రష్యా-నాటోల ప్రత్యక్ష పోరు తప్పదా! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన రష్యా.. అణ్వస్త్ర వినియోగానికీ వెనుకాడబోమంటు హెచ్చరికలు జారీ చేసింది.

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం.. మరో భారీ విధ్వంసానికి దారితీసేలా మలుపు తీసుకుంటోంది. నాలుగు ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా విలీనం చేసుకునే ప్రక్రియ దాదాపు ముగింపునకు వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు వాటిని తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు అధ్యక్షుడు పుతిన్‌ నేడో, రేపో ప్రకటన చేయనున్నారు. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. ఆయన తగ్గడం లేదు. ఇరుపక్షాల నోటా అణ్వస్త్రాల మాట వినిపిస్తున్న వేళ.. తాజా పరిణామం ఎక్కడకు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది.

సరిహద్దులో ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు రష్యా రిఫరెండం పాచిక వేసిన సంగతి తెలిసిందే. ప్రజాభిప్రాయం పేరుతో ఈనెల 23-27 మధ్య అక్కడ ఓటింగ్‌ నిర్వహించారు. మాస్కోకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగినట్టు చెబుతున్నా.. ఈ ప్రక్రియ అంతా పచ్చి బూటకమని ఉక్రెయిన్‌, అమెరికా సహా నాటో దేశాలు కొట్టిపారేశాయి. ప్రజలెవరూ స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు లేవని, రెఫరెండాన్ని అంగీకరించే సమస్యే లేదని తేల్చిచెప్పాయి. అయినా పుతిన్‌ వాటిని పెడచెవిన పెట్టారు.

2014లో క్రిమియాను ఆక్రమించే సమయంలోనూ ఆయన మొదట దాడులకు దిగారు. తర్వాత అక్కడ రెఫరెండం చేపట్టి, విలీనం చేసుకున్నారు. అమెరికా, నాటోలు నాడు హెచ్చరికలకే పరిమితం అయ్యాయి తప్ప, ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఆ దేశాలు తమను ఏం చేయగలవన్నది పుతిన్‌ ధీమాగా విశ్లేషకులు చెబుతున్నారు.

.

ఉక్రెయిన్‌ నష్టపోయేదేంటి?
జెలెన్‌స్కీ సేనలు నెలల తరబడి రష్యా బలగాలను దీటుగా ఎదుర్కోవడం విశేషమే. యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో లక్షల మంది దేశాన్ని వీడగా, ఎంతోమంది ఉక్రెయిన్‌ ప్రజలు యుద్ధగాయాలకు బలయ్యారు. గాయాలతో శాశ్వత వైకల్యానికి గురైనవారెందరో. చెల్లాచెదురైన కుటుంబాలెన్నో! భారీ ప్రాణ, ఆస్తి నష్టం అటుంచితే.. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లు రష్యాలో విలీనం కావడం ఉక్రెయిన్‌కు మరో భారీ దెబ్బ అవుతుంది.

ఉక్రెయిన్‌ మొత్తం భూభాగంలో ఈ నాలుగు ప్రాంతాల వాటా 15%. ఇది హంగరీ లేదా పోర్చుగల్‌ భూభాగంతో సమానం. వీటికి క్రిమియాను కూడా కలిపితే.. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర మంత భూభాగంతో సమానమవుతుంది.

పుతిన్‌ ప్రకటన తర్వాత ఏం జరుగుతుంది?
ఉక్రెయిన్‌ భూభాగాలు రష్యాలో విలీనమైనట్టు పుతిన్‌ ప్రకటించిన తర్వాత.. నాటో దళాలు ఇక అక్కడ అడుగు పెట్టలేవు. ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం.. పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతుంది. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు అణ్వస్త్ర ప్రయోగాలకూ వెనకాడబోమని పుతిన్‌ ఇటీవల వ్యాఖ్యానించడం వెనుక మర్మం ఇదేనని భావిస్తున్నారు. నాలుగు ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యాలో విలీనం చేస్తున్నట్టు పుతిన్‌ ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.

  • ఆ తర్వాత రష్యా, నాటో బలగాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ఆరంభమయ్యే పరిస్థితులు లేకపోలేదు.
  • ఇది మరింత ముదిరితే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాటలు నిజం కావచ్చు.
  • విలీన ప్రకటన తర్వాత రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు అత్యంత కఠిన ఆంక్షలు విధించవచ్చు.
  • నాలుగు ప్రాంతాల విలీనం తర్వాత ఉక్రెయిన్‌ వెనక్కు తగ్గి, కాల్పుల విరమణకు అంగీకరిస్తే సరి. లేకుంటే విలీనమైన కొత్త ప్రాంతాల్లో రష్యా తన సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది. పుతిన్‌ ‘సైనిక సమీకరణ’ ఆదేశాలతో చేర్చుకుంటున్న 3 లక్షల మందిని ఇందుకు వినియోగించే అవకాశముంది.
  • కానీ, ఉక్రెయిన్‌ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. తమ గడ్డ నుంచి చివరి రష్యన్‌ సైనికుడిని తరిమేసేంత వరకూ విశ్రమించబోమని తెగేసి చెబుతోంది. తమ భూభాగంపై రష్యా ఆధిపత్యాన్ని ససేమిరా సహించబోమని చెప్పింది. ఇన్నాళ్లు యుద్ధం సాగించిన తర్వాత కూడా... మాస్కోపై పోరాడేందుకు ఆయుధాలు ఇవ్వాలంటూ పశ్చిమ దేశాలను కోరుతోంది.

ఇవీ చదవండి: తూర్పు ఉక్రెయిన్​లో రెఫరెండం.. 99% మంది ఓటు రష్యాకే!.. విలీనం ఖరారు

'ఊరికే చెప్పడం లేదు.. అణుబాంబు వేసి తీరుతాం!'.. రష్యా హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.