ఉక్రెయిన్​ ప్రాంతాలు రష్యాలోకి.. రెఫరెండం స్టార్ట్.. బూటకమన్న ఉక్రెయిన్

author img

By

Published : Sep 23, 2022, 12:43 PM IST

russia referendum ukraine

Russia Referendum Ukraine: ఉక్రెయిన్‌ సేనలు క్రమంగా బలపడుతూ.. ఎదురుదాడికి దిగుతున్న వేళ ఇప్పటికే ఆక్రమించుకున్న ప్రాంతాలను విలీనం చేసుకునేందుకు రష్యా సిద్ధమైంది. లుహాన్స్క్‌, దొనెత్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాల్లో రిఫరెండం చేపట్టింది. అనుకూల ఫలితాలు సాధించేందుకు. మరోవైపు, ఈ రిఫరెండం బూటకమన్న ఉక్రెయిన్‌.. తమ భూభాగాలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.

Russia Referendum Ukraine : ఉక్రెయిన్‌పై సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రస్తుతం తమ నియంత్రణలోని తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతాలను విలీనం చేసుకోవటంపై దృష్టి సారించింది. దొనెత్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా రష్యా ఈ తరహా ప్రజాభిప్రాయాన్ని చేపట్టింది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్‌ ఈనెల 27న ముగియనుంది.

ఉక్రెయిన్‌ భూభాగాలను విలీనం చేసేందుకు రిఫరెండం అవసరమని పుతిన్‌కు సన్నిహితుడొకరు పేర్కొనడం వల్ల ఈ అంశం తెరపైకి వచ్చింది. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ క్రమంగా బలపడుతూ రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి చేజిక్కించుకుంటున్న తరుణంలో రష్యా ఈ రిఫరెండం నిర్వహిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు.

దొనెత్స్క్‌, లుహాన్స్క్‌తో కూడిన డాన్‌బాస్‌ ప్రాంతంలో 2014 నుంచే రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ పాలనలో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న తాము త్వరలోనే మాతృదేశం రష్యాలో విలీనం కాబోతున్నామని తిరుగుబాటు నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దొనెత్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాల్లో రిఫరెండంకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లను స్థానిక ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించారు. పోలింగ్‌ స్టేషన్లకు ఇప్పటికే బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిఫరెండం సజావుగా సాగేందుకు.. ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ప్రమాదం లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
రష్యా ఆక్రమించుకున్న తమ దేశానికి చెందిన 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. తమ భూ భాగాలకు విముక్తి కల్పించే హక్కు తమకు ఉందని, ఇది జరగడం తథ్యమని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి: స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల.. హిజాబ్​పై ఎందుకింత వివాదం?

అదుపు తప్పి రెండు బస్సులు బోల్తా.. 12 మంది మృతి.. 31 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.