''పచ్చ'గా పదికాలాలు ఉండాలంటే.. చెట్లు పెంచాల్సిందే!'

author img

By

Published : Nov 20, 2022, 6:48 AM IST

planting trees

పరిసరాల్లో చెట్ల సంఖ్య పెరిగితే అకాల మరణాలకు కళ్లెం వేయవచ్చని ఓ అధ్యయనం రుజువు చేసింది. నాటిన ప్రతి మొక్క ద్వారా ప్రాణాలు నిలుస్తున్నాయని అందులో వెల్లడైంది. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటిన చోట మరణాల రేటు, తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

చెట్లను యథేచ్ఛగా నరికేసి, పచ్చదనానికి తిలోదకాలివ్వడమే అభివృద్ధిగా భావించే నాగరిక సమాజానికి ఇది మేలుకొలుపు! మనిషి ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించాలంటే చుట్టూ పచ్చదనం ఉండాలని విస్పష్ట ఆధారాలతో ఓ అధ్యయనం రుజువు చేసింది. నాటిన ప్రతి మొక్క ద్వారా ప్రాణాలు నిలుస్తున్నాయని అందులో వెల్లడైంది. అంతేకాదు.. చెట్లు నాటడానికి, సంరక్షణకు అయ్యే వ్యయంతో పోలిస్తే.. వాటి ద్వారా ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు అపారమని కూడా తేలింది.

ప్రకృతితో సహజీవనంతో అకాల మరణాల ముప్పు తగ్గుతుందనడానికి ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అయితే ఆ పరిశోధనల్లో చాలావరకూ ఉపగ్రహ చిత్రీకరణ విధానాల ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో హరిత సూచికను అంచనా వేసినవే. ఆ శాటిలైట్లు భిన్నరకాల పచ్చదనాలకు మధ్య ఉన్న వైరుధ్యాలను గుర్తించలేవు. అందువల్ల వాటి ఆధారంగా నిర్దిష్ట అంచనాలకు రావడం కష్టమని శాస్త్రవేత్తలు తెలిపారు.

పరిశోధన ఇలా..
ఈ నేపథ్యంలో చెట్లతో మానవుల ఆరోగ్యానికి ఒనగూరే ప్రయోజనాన్ని సశాస్త్రీయంగా వెలుగులోకి తీసుకురావడానికి బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌, అమెరికా అటవీశాఖ పరిశోధన చేపట్టాయి. 1990 నుంచి 2019 మధ్య అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నగర వీధుల్లో 'ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ట్రీస్‌' అనే స్వచ్ఛంద సంస్థ నాటిన 49,246 మొక్కలు చూపిన ప్రభావంపై ఇందులో దృష్టిసారించాయి.
గడిచిన 5, 10, 15 ఏళ్లలో సంబంధిత ప్రాంతంలో నాటిన మొక్కల సంఖ్యను పరిశీలించారు. ఈ సమాచారాన్ని అక్కడ చోటుచేసుకున్న గుండె, శ్వాస సంబంధ లేదా ప్రమాదేతర కారణాలతో సంభవించిన మరణాలతో కలిపి విశ్లేషించారు.

ఫలితాలివీ..
ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటిన చోట మరణాల రేటు, తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గుండె జబ్బు మరణాల్లో 6 శాతం, ప్రమాదేతర చావుల్లో 20 శాతం మేర తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా పురుషులు, 65 ఏళ్లు పైబడ్డవారి కేసుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది.

చెట్టు పెరిగేకొద్దీ..

.

మొక్కలు పెద్దవయ్యేకొద్దీ మానవ ఆరోగ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలూ పెరుగుతున్నాయని తేలింది. మొక్కలు నాటాక మొదటి ఐదేళ్లలో.. ఆ ప్రాంతంలో అకాల మరణాల్లో తగ్గుదల 15 శాతం మేర ఉండగా, 11-15 ఏళ్లకు అది 30శాతానికి పెరిగింది.

ఈ మూడింటివల్లే..
పచ్చదనంతో ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందన్నది నిర్దిష్టంగా వెల్లడికాలేదు. అయితే చిన్నచెట్లతో పోలిస్తే పెద్ద వృక్షాలతో ఎక్కువ ప్రయోజనం కలగడాన్ని బట్టి కొంత స్పష్టత వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో సమతౌల్యం లోపించడం, అధిక ధ్వనులే అకాల మరణాలు పెరగడానికి ప్రధాన కారణాలు. ఈ మూడింటినీ అధిగమించడంలో పెద్ద వృక్షాలు కీలకమవుతున్నాయని పరిశోధకులు విశ్లేషించారు.

ఇదీ లెక్క..!
పోర్ట్‌లాండ్‌లో ఒక మొక్కను నాటడానికి, ఏటా దాన్ని సంరక్షించడానికి 3వేల నుంచి 13వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. అది నిలిపే ప్రాణాలతో ఏటా 1.42 కోట్ల డాలర్లు సమకూరినట్లవుతుందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.