రాత్రిపూట మార్కెట్లు తొందరగా మూసేస్తే.. జనాభా పెరుగుదల అరికట్టవచ్చట!

author img

By

Published : Jan 9, 2023, 6:44 AM IST

pak minister bizarre theory on population boom

ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాకిస్థాన్‌.. అనేక ఆంక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్‌ పంపిణీ, వినియోగంపైనా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట మార్కెట్లు తొందరగా మూసివేసే ప్రాంతాల్లో జనాభా పెరుగుదల లేదంటూ పాక్‌ రక్షణశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాకిస్థాన్‌లో ఉద్యోగుల జీతాలు, పథకాల సబ్సిడీల్లో కోతతోపాటు విద్యుత్‌ ఆదా చేసుకునేందుకు పలు ఆంక్షలు విధిస్తోంది. దీంతో దేశంలో వ్యాపార కార్యకలాపాలు రాత్రి 8గం.లకే మూసివేయాలని ఆదేశిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం మార్కెట్లను తొందరగా మూసివేయడం వల్ల జనాభా పెరుగుదలను అరికట్టవచ్చని కొత్త భాష్యం చెప్పారు.

'కల్యాణ మండపాలను రాత్రి 10గంటలకే మూసేయాలి. మార్కెట్లను రాత్రి ఎనిమిదిన్నర లోపే మూయాలి. తద్వారా రూ. 60 బిలియన్లు (పాక్‌ కరెన్సీలో) ఆదా చేయొచ్చు. పైగా.. మార్కెట్లు రాత్రి 8గంటలకే మూసివేస్తోన్న దేశాల్లో జనాభా పెరుగుదల లేదు' అని వ్యాఖ్యానించారు. ఇంధన ఆదా ప్రణాళికపై మాట్లాడుతూ.. 'మార్కెట్ల మూసివేతకు- జనాభా నియంత్రణ'తో పోల్చి చెప్పిన ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న పాకిస్థాన్‌.. ఇంధన పొదుపును వెంటనే అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్‌ కోతల వంటి ఆంక్షలను తప్పనిసరి చేస్తోంది. ఇంధనం దిగుమతిని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని .. త్వరలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.