ఉత్తర కొరియాను కుదిపేస్తున్న కరోనా.. 3.5 లక్షల మంది క్వారంటైన్​!

author img

By

Published : May 13, 2022, 8:34 AM IST

North Korea covid cases

North Korea Covid Cases: ఉత్తర కొరియాను కొవిడ్​ మహమ్మారి కుదిపేస్తోంది. గురువారం ఒక్కరోజే 18వేల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అందులో ఒకరికి ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయింది. మొత్తంగా 3.5 లక్షల మందికిపైగా జ్వరపీడితులుగా మారినట్లు పేర్కొంది.

North Korea covid cases: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైనట్లు ప్రకటించిన మరుసటి రోజునే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని, 3.5 లక్షల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, మొత్తం ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు.. అస్తవ్యస్తమైన ఆరోగ్య వ్యవస్థ, టీకాలు వేయని, పోషకాహార లోపం ఉన్న ప్రజలతో దేశంలో కొవిడ్​-19 విజృంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఒక్క రోజే 18వేల మందికి: ఏప్రిల్​ చివరి వారం నుంచి ఇప్పటివరకు 3.5 లక్షల మంది జ్వరపీడితులుగా మారినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్​ సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ తెలిపింది. అందులో 1,62,200 మంది కోలుకున్నారని, కొత్తగా గురువారం ఒక్కరోజే 18,000 మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. వారందరినీ ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆరుగురు మృతి చెందగా అందులో ఒకరికి ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయిందని తెలిపింది కేసీఎన్​ఏ. అయితే, కొవిడ్​-19 ఎంత మందికి సోకిందనేది స్పష్టత లేదని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​: కరోనా ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది కిమ్​ ప్రభుత్వం. పలువురికి కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు పలు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఏప్రిల్​ 25న పెద్ద ఎత్తున నిర్వహించిన మిలిటరీ పరేడ్​ కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ ప్రధాన కేంద్రాన్ని గురువారం సందర్శిన కిమ్​ జోంగ్​ ఉన్​.. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్​ కట్టడిలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణ కొరియా వైద్య సాయం: కరోనా ఉద్ధృతి సమయంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని కొవాక్స్​ నుంచి టీకాలు తీసుకునేందుకు నిరాకరించిన ఉత్తర కొరియా ప్రస్తుతం విదేశాల నుంచి సాయం అందుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు పలువురు నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే మానవతా కోణంలో ఉత్తర కొరియాకు వైద్య సాయంతో పాటు ఇతర సహాయం అందించేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని ఇరు దేశాల వ్యవహారాలను చూసే ఆ దేశ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం

శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘె- ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.