ఇరాన్​లో మహిళల ఆందోళనలు.. జుట్టు కత్తిరించుకుంటూ.. హిజాబ్​లను కాల్చుతూ.. ఎందుకంటే?

author img

By

Published : Sep 20, 2022, 8:40 AM IST

morality police in Iran

Morality Police In Iran: ఇరాన్​లో పోలీసుల కస్టడీలో ఓ మహిళ మరణించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆమె మృతితో మహిళలు రోడ్డెక్కారు. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న అణచివేతను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. అలాగే హిజాబ్​లను కాల్చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Morality Police In Iran: ఇరాన్‌లో ఇటీవల పోలీసు కస్టడీలో ఓ మహిళ మృతిచెందడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె మృతితో ఇరాన్‌ మహిళలు రోడ్డెక్కారు. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటోన్న అణచివేతను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలువురు మహిళలు తమ జుట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాలి. జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్‌ ధరించాలి. ఈ నియమాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ఏడాది జులైలో అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు జరిమానాలతో పాటు అరెస్టులు కూడా చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'మొరాలిటీ పోలీసు' విభాగాన్ని ఏర్పాటు చేశారు.

కాగా.. ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్నఆమె గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ గత శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా హింసించారని కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. కానీ, ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.

ఈ క్రమంలోనే అమిని మృతిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అనేక మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. అటు అమిని స్వస్థలంలోనూ నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు. బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.

మరోవైపు, మహిళలను అణచివేసేందుకు తీసుకొస్తోన్న చట్టాలకు వ్యతిరేకంగా కొందరు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. తమ జుట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తూ నిరసన ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్‌ జర్నలిస్టు మసిహ్‌ అలినేజద్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. "అమినిని హిజాబ్‌ పోలీసులు హత్య చేసినందుకు నిరసనగా ఇరాన్‌ మహిళలు తమ జుట్టు కత్తిరించుకుని, హిజాబ్‌లకు నిప్పు పెడుతూ ఆందోళన చేస్తున్నారు. ఏడేళ్ల వయసు నుంచి మేం హిజాబ్‌ ధరించకపోతే మమ్మల్ని స్కూల్లోకి అనుమతించరు. ఉద్యోగాలు ఇవ్వరు. ఈ వివక్షపూరిత చట్టాలతో మేం విసిగిపోయాం" అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఇవీ చదవండి: బ్రిటన్ రాణికి తుది వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు

విమానంలో ప్రయాణికుడి హల్​చల్.. కాళ్లతో కిటికీలు పగలగొట్టే యత్నం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.