రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు- యుద్ధం ఆగుతుందా?

author img

By

Published : Mar 16, 2022, 10:06 PM IST

UN court

Russia Ukraine war: ఉక్రెయిన్​పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సైనిక చర్యను వెంటనే ఆపాలని, ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన సేనలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. రష్యాపై ఐసీజేలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించినట్లు ట్వీట్​ చేశారు జెలెన్​స్కీ.

Russia Ukraine war:ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అయితే, ఐసీజే ఆదేశాలకు రష్యా కట్టుబడి ఉంటుందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

" ఉక్రెయిన్‌ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదు. "

- జోన్​ ఈ డోనోగ్యూ, కోర్టు అధ్యక్షుడు, యూఎస్​ న్యాయమూర్తి.

తమ దేశంపై రష్యా చేస్తున్న మారణహోమాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని రెండు వారాల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఉక్రెయిన్​. ఉక్రెయిన్​ మారణహోమానికి పాల్పడుతోందనే తప్పుడు వాదనలతో 1948 నాటి నిబంధనలను రష్యా అతిక్రమించి తమ దేశంపై దాడులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ విషయంలో కలుగచేసుకుని రష్యా చర్యలను నిలువరించాలని విన్నవించింది.

అంతర్జాతీయ కోర్టులో పూర్తి విజయం సాధించాం: జెలెన్‌స్కీ

రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దండయాత్రను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఇచ్చిన ఈ తీర్పునకు రష్యా కట్టుబడి ఉండాలన్నారు. దీన్ని విస్మరిస్తే రష్యా మరింత ఒంటరవుతుందని పేర్కొన్నారు.

రష్యా-అమెరికా మధ్య తొలిసారి ఉన్నతస్థాయి సంప్రదింపులు!

ఉక్రెయిన్‌, రష్యా మధ్య గత మూడు వారాలుగా భీకర దాడులు కొనసాగుతున్న వేళ బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి అమెరికా, రష్యా మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటుచేసుకున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులివాన్‌ బుధవారం రష్యా భద్రతా మండలి కార్యదర్శి జనరల్‌ నొకోలాయ్‌ పట్రుషెవ్‌తో మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడిచింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జాక్‌ పునరుద్ఘాటించారని పేర్కొంది. దౌత్యం గురించి రష్యా సీరియస్‌గా ఉంటే గనక తక్షణమే ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని సూచించినట్టు తెలిపింది.

ఇదీ చూడండి: 'తక్షణమే మీ సాయం అవసరం'.. అమెరికా కాంగ్రెస్​కు జెలెన్​స్కీ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.