Floating City: వరదను తట్టుకునేలా అలలపై అందాల నగరం!

author img

By

Published : Nov 25, 2021, 7:36 AM IST

Floating City

సముద్రమట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదల వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకుగాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్‌ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని(floating city South Korea) నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. 2025 నాటికి పూర్తి చేయనున్నారు.

జరాసంధుడి దాడుల నుంచి యాదవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు సముద్రంలో ద్వారక నగరాన్ని నిర్మించాడు! ఇది పురాణాలు చెబుతున్న మాట. పర్యావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా ముంచుకొస్తున్న జల ప్రళయాలను తప్పించుకునేందుకు సముద్రంపై మానవులు నగరాలు నిర్మిస్తున్నారు! ఇది నేటితరం మాట. అవును- మీరు చదివింది నిజమే. సముద్రమట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదల వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకుగాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్‌ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని(Floating city South Korea) నిర్మించనున్నారు. ఇందుకోసం బుసాన్‌ మెట్రోపాలిటన్‌ నగరం, ఐక్యరాజ్యసమితి ఆవాస సంస్థ, న్యూయార్క్‌కు చెందిన 'ఓషియానిక్స్' కంపెనీ మధ్య తాజాగా చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాదే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Floating City
నీటిపై తెలియాడే నగరం(ఊహాత్మక చిత్రం)

ఎలా నిర్మిస్తారు?

ఈ నగరం మానవ సృష్టిత దీవుల సమాహారంగా ఉంటుంది. నీటిపై తేలియాడే వెదురుబొంగుల సహాయంతో తొలుత షడ్భుజాకారంలో పునాదుల వంటి వేదికలను(అడుగుభాగం) సృష్టిస్తారు. అలల ధాటికి కొట్టుకుపోకుండా సముద్రగర్భంలో వాటికి లంగరు వేస్తారు. కాంక్రీటు కంటే 2-3 రెట్లు గట్టిదైన సున్నపురాయితో వెదురు వేదికలపై పూత ఏర్పాటుచేస్తారు. వాటిపై ఏడంతస్తుల వరకు భవనాలను నిర్మిస్తారు. మార్కెట్‌, ఆస్పత్రి, క్రీడాప్రాంగణం, పాఠశాల, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వసతులన్నీ నగరంలో ఉంటాయి. వరదలు, తుపాన్లు, సునామీల వంటి ప్రకృతి విపత్తులను అది తట్టుకోగలదు.

Floating City
ఫ్లోటింగ్​ సిటీలో నివసిస్తున్న జనం (ఊహాత్మక చిత్రం)

స్వయం సమృద్ధంగా..

తేలియాడే నగరాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దుతారు. భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటుచేసి.. స్థానిక అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ప్రజలు తమకు కావాల్సిన ఆహారం, తాగునీటిని నగరంలోనే తయారుచేసుకోవాలి. మట్టి అవసరం లేకుండా గాలిలో/తేమ వాతావరణంలో మొక్కలను పెంచడాన్ని ఏరోపోనిక్స్‌ అంటారు. మేలుదాయక బ్యాక్టీరియాను ఉపయోగించుకొని మొక్కలు, చేపల పెంపకం చేపట్టడాన్ని ఆక్వాపోనిక్స్‌ అంటారు. ఈ రెండు విధానాలనూ అనుసరించి నగర ప్రజలు సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది.

వెదురు పునాదుల దిగువన ఇలా..

  • ఇలాంటి నగరాల నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా మరో 10 ప్రభుత్వాలతో ఓషియానిక్స్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.
  • ప్రపంచవ్యాప్తంగా అనేక తీర పట్టణాల తరహాలోనే బూసాన్‌కు కూడా సముద్ర మట్టాల పెరుగుదల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ నగరాన్ని వరదలు ముంచెత్తితే వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. వేలమంది నిరాశ్రయులవుతారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సముద్రంలో కొత్త నగరాన్ని నిర్మించుకోవాలని అక్కడి అధికారవర్గాలు నిర్ణయించాయి.
  • ఎక్కడ నిర్మించనున్నారు?: దక్షిణ కొరియాలోని బూసాన్‌ నగర తీరంలో..
  • నిర్మాణం ఎప్పటికల్లా పూర్తవుతుంది?: 2025
  • అంచనా వ్యయం: దాదాపు రూ.1490 కోట్లు
  • ఎంత విస్తీర్ణంలో..?: 75 హెక్టార్లు
  • ఎంతమంది నివసించొచ్చు?: 10 వేలమంది
  • విద్యుత్తుకు ఆధారం: సౌరశక్తి
  • ఎవరు నిర్మిస్తున్నారు?: ఓషనిక్స్‌ కంపెనీ

ఇదీ చూడండి: China population: పెళ్లికి యువత 'నో'.. జనాభా సంక్షోభంలో చైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.