కొవిడ్​ సోకిందని పిల్లులను చంపిన అధికారులు!

author img

By

Published : Sep 30, 2021, 5:14 AM IST

covid cat

కరోనా కేసులను(Covid in China) నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో.. కొవిడ్​ సోకిన మూడు పిల్లులను అధికారులు చంపేశారు.

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో కేసులు(Covid in China) తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర చైనాలోని హార్బిన్‌ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు పాజిటివ్‌గా తేలడం వల్ల వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్‌మెంట్‌ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని పరిస్థితుల్లో వాటిని అధికారులు చంపాల్సి వచ్చిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

ఆ పెంపుడు పిల్లుల యజమానికి సెప్టెంబర్‌ 21న వైరస్‌ నిర్ధరణ కాగా, ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె పెంచుకుంటున్న మూడు పిల్లులకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. మనుషులకు మాత్రమే సోకే కరోనా వైరస్‌.. కొన్ని సందర్భాల్లో మానవుల ద్వారా జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) పేర్కొంది. అందుకే కరోనా సోకినా, లక్షణాలు బయటపడినా పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సీడీసీ సూచిస్తోంది.

కొవిడ్‌పై చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే ఆ ప్రాంతం మొత్తంలో కఠిన లాక్‌డౌన్‌ విధిస్తోంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలో వీలైనంత మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సైతం వేగంగా చేపడుతోంది. 100 కోట్ల మందికి పూర్తిగా వ్యాక్సిన్లు వేసినట్లు రెండు వారాల క్రితమే చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఎన్‌హెచ్‌సీ ప్రతినిధి మీ ఫెంగ్‌ బీజింగ్‌లో మాట్లాడుతూ.. మొత్తం 2.16 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు వేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:చైనా సర్కారు 'అబార్షన్ల' నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.