China Help Afghanistan: అఫ్గానిస్థాన్​కు చైనా భారీ సాయం

author img

By

Published : Sep 30, 2021, 5:03 PM IST

Updated : Sep 30, 2021, 5:32 PM IST

china help to afghan

అఫ్గాన్ ప్రజల కోసం 31 మిలియన్​ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని అందజేసింది చైనా(China Help Afghanistan). ఇందులో భాగంగా దుప్పట్లు, జాకెట్లు వంటివి ఆ దేశానికి సరఫరా చేసింది. రానున్న రోజుల్లో మరింత సాయాన్ని తాము అఫ్గాన్​కు అందేజేస్తామని చెప్పింది. మరోవైపు.. రానున్న నెలల్లో​ భారీ మానవతా సంక్షోభ ముప్పును అఫ్గాన్​ ఎదుర్కోనుందని 'రెడ్​ క్రాస్' సంస్థ హెచ్చరించింది. ​

అఫ్గాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా.. మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్​ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని(China Help Afghanistan) అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్​కు సరఫరా చేసింది. ఇవి బుధవారం రాత్రి.. కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయని(China Help Afghanistan) చైనా అధికారిక వార్తా సంస్థ 'జిన్హువా' వెల్లడించింది.

కాబుల్​కు చేరుకున్న ఈ వస్తువులను అఫ్గానిస్థాన్​కు చైనా రాయబారి వాంగ్ యూ, అఫ్గాన్​ ఆపద్ధర్మ ప్రభుత్వంలోని శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి ఖలీల్​-ఉర్​-రెమహాన్​ హక్కానీ.. విమానాశ్రయంలో అందుకున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య చైనా తక్కువ వ్యవధిలోనే అప్గాన్​కు మానవతా సాయం కింద ఈ వస్తువులను అందజేసిందని వాంగ్​ యూ చెప్పారు.

"శీతాకాలంలో అఫ్గాన్ ప్రజలకు ఉపయోగపడే బ్లాంకెట్లు, జాకెట్లు వంటివి అఫ్గాన్​కు చైనా అందజేసింది. భవిష్యత్తులోనూ అప్గాన్​కు ఆహారం సహా ఇతర వస్తువులను మేం సరఫరా చేస్తాం. అతి త్వరలోనే అవి అఫ్గాన్​కు చేరుతాయి."

-వాంగ్ యూ, అఫ్గాన్​కు చైనా రాయబారి

'చైనా మాకు మంచి మిత్ర దేశం'

చైనా చేసిన సాయానికిగాను హక్కానీ ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా తమకు మంచి పొరుగుదేశం, మిత్రదేశం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ తమకు చైనా నుంచి సాయం(China Help Afghanistan) అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

"సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటను మేము నిలబెట్టుకుంటాం. అప్గాన్​ను విదేశీ ఉగ్రశక్తులకు అడ్డాగా మారనివ్వబోమని అంతర్జాతీయ సమాజానికి, పొరుగు దేశానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాం.

- ఖలీల్​-ఉర్​-రెమహాన్​ హక్కానీ, అఫ్గాన్​ శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి.

అయితే.. వివిధ దేశాల తరహాలోనే చైనా కూడా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కానీ, పాకిస్థాన్​, రష్యాల దేశాలతో పాటుగా కాబుల్​లో తమ దేశ రాయబార కార్యాలయాన్ని తెరిచే ఉంచింది. గత నెలలో అప్గాన్​ను తాలిబన్ల ఆక్రమించుకున్నాక ఆ దేశం నుంచి వివిధ దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేశాయి.

భారీ ముప్పు..

ఆర్థిక మాంద్యం, రానున్న శీతాకాలం కారణంగా.. అఫ్గాన్​లో భారీ మానవతా సంక్షోభం(Afghan Humanitarian Crisis) ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్​ ఫెడరేషన్ ఆఫ్​ రెడ్​క్రాస్ హెచ్చరించింది. అప్గాన్​లో పని చేసేవారికి వేతనాలు చెల్లించకపోవడమే ఈ ముప్పునకు కారణమని 'రెడ్​క్రాస్​' డైరెక్టర్​ అలెగ్జాండర్​ మాథ్యూ తెలిపారు. ముఖ్యంగా వైద్య రంగంలో పని చేసేవారికి వెంటేనే జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

"కరవు, పేదరికం వల్ల ఏర్పడిన ఆహార కొరత, శీతాకాలం కారణంగా రానున్న నెలల్లో అఫ్గాన్​.. అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోనుంది. ఆరోగ్య సేవలు నిలిచిపోతాయి. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని అఫ్గాన్ పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి" అని మాథ్యూ హెచ్చరించారు.

మహిళల నిరసన..

మరోవైపు.. అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ విద్యా హక్కును తాలిబన్లు హరించివేయడానికి వ్యతిరేకంగా గురువారం కాబుల్​లోని ఓ పాఠశాల ముందు కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. అయితే.. తాలిబన్లు వారిని తుపాకులతో బెదిరించి చెదరగొట్టారు.

ఇదీ చూడండి: మహిళా జడ్జిల కోసం వేట.. మాకే శిక్ష వేస్తారా అంటూ...

ఇదీ చూడండి: తాలిబన్ల దుశ్చర్య- తండ్రిపై అనుమానంతో పిల్లాడికి మరణశిక్ష!

Last Updated :Sep 30, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.