అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం
Updated on: Jan 13, 2022, 1:40 PM IST

అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం
Updated on: Jan 13, 2022, 1:40 PM IST
Afghanistan Poverty Facts: తాలిబన్ల పాలనలో అఫ్గాన్ల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కుటుంబ ఆకలి తీర్చేందుకు ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూట గడిచేందుకు తమ అవయవాలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. చిన్నారుల ఆకలి బాధ చూడలేక తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు అక్కడి ప్రజలు.
Afghanistan Poverty Facts: కుటుంబాలకు పట్టెడన్నం పెట్టడం కోసం అఫ్గాన్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న తమ చిన్నారుల కడుపు నింపేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు. చేసేందుకు పని లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. దిక్కుతోచని స్థితిలో.. తమ శరీర అవయవాలను విక్రయిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లల ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చిన్నారుల రేపటి భవిష్యత్తు కోసం నేటి తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.
"నేను బయటకు వెళ్లి డబ్బు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని విక్రయించాను. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా ఆహారాన్ని అందిస్తాను కదా."
-గులాం హజ్రత్, కిడ్నీని విక్రయించిన వ్యక్తి
తాలిబన్ల పాలనలో..
Afghan Poverty Rate: కుటుంబాన్ని పోషించేందుకు గులాం హజ్రత్ తన కిడ్నీని లక్షా 69 వేల రూపాయలకు అమ్మేశాడు. అఫ్గానిస్తాన్‌లో చాలామంది తండ్రుల వ్యథ ఇదే పరిస్థితిలో ఉంది. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి అఫ్గాన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అఫ్గాన్‌లో గుక్కెడు గింజలు దొరక్క ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు కిడ్నీలను విక్రయిస్తున్నారు. తాలిబన్ల పాలనలో కఠిన పేదరికంలోకి జారుకున్న అఫ్గాన్లు.. ముఖ్యమైన అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్ ప్రావిన్స్‌లో కిడ్నీల విక్రయం ఎక్కువగా సాగుతోంది
తాలిబన్లు ఆక్రమించుకున్న నాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థ వారి పాలనలో మరింత దిగజారింది. ఈ కఠిన పరిస్థితుల్లో అఫ్గన్లు అత్యంత దుర్బల జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కఠిక పేదరికంలో కుటుంబానికి ఆహారం పెట్టేందుకు అవయవాలు అమ్మేస్తున్నారు. కిడ్నీ దాత , కొనుగోలుదారు పరస్పర అంగీకారంతో కిడ్నీలు విక్రయిస్తున్నారు.
లెక్క చేయడం లేదు..!
Afghanistan Poverty Level: ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది దాతలు కిడ్నీలను విక్రయించడానికి ముందుకు వస్తున్నారని స్థానిక వైద్యులు తెలిపారు. కిడ్నీని కోల్పోవడం వల్ల కలిగే ప్రమాదాల కంటే వారి కుటుంబాన్ని పోషించడానికే వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు.
కిడ్నీని విక్రయించిన తర్వాత కనీసం ఒక ఏడాది పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ఎవరూ లెక్క చేయడం లేదు. రెండు మూడు నెలలకే వేరే పనులకు వెళ్లిపోతున్నారు. తమ ఆర్థిక స్థితికి ఖాళీగా ఉండలేమని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
చాలా మంది ప్రజలు ప్రాణ భయంతో దేశం విడిచి వెళ్లారని స్థానిక మత పెద్ద చెప్పారు. వారిని ఆయా దేశాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపాయని, దేశం విడిచేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు చాలా మంది కిడ్నీలు అమ్ముతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: హఫీజ్ సయీద్ ఇంటి బయట పేలుడు- నలుగురికి మరణశిక్ష
100 మందుపాతరలు గుర్తించిన ఎలుక మృతి
