పోలాండ్​ పర్యటనకు బైడెన్.. ఉక్రెయిన్ పరిస్థితిపై భేటీ

author img

By

Published : Mar 21, 2022, 10:27 AM IST

Biden to visit Poland

Biden Poland Visit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం ఐరోపా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ పొరుగు దేశం పోలాండ్ అధ్యక్షునితో సమావేశం కానున్నారు. యుద్ధ సమయంలో నాటో దేశాలు ఉక్రెయిన్​కు అందిస్తున్న సాయం గురించి చర్చించనున్నారు.

Biden Poland Visit: అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం కీలక ఐరోపా పర్యటన చేపట్టనున్నారు. నాటో, ఐరోపా మిత్ర దేశాలతో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నారు. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు నెల కావస్తున్న తరుణంలో బైడెన్ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Biden poland news

పర్యటనలో భాగంగా బైడెన్ మొదట బ్రస్సెల్స్ చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్​ దుబాతో భేటీ కానున్నారు. రష్యా భీకర దాడులతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్​కు అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న మానవతా సాయం గురించి చర్చించనున్నారు. అయితే ఉక్రెయిన్​కు సందర్శించే ఆలోచన బైడెన్​కు లేదని శ్వేతసౌధం వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

Joe Biden News

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా, నాటో, ఐరోపా దేశాలు ఐక్యంగా ముందుకుసాగుతున్నాయి. రష్యా సైనిక చర్యను తమకు భద్రతా పరంగా, వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా ముప్పుగా భావిస్తున్నాయి. అయితే నాటో సభ్యదేశాలు కానప్పటికీ ఉక్రెయిన్ వంటి దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి.

యుద్ధ సమయంలో ఉక్రెయిన్​కు మిగ్ ఫైటర్ జెట్లు నాటో ఎయిర్​బేస్ ద్వారా సరఫరా చేయాలని పోలాండ్​ మార్చి 9న చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. అలా చేస్తే యుద్ధానికి ఇంకా ఆజ్యం పోసినట్లు అవుతుందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్​కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'పుతిన్​తో చర్చలకు సిద్ధం.. విఫలమైతే మూడో ప్రపంచయుద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.