దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

author img

By

Published : Nov 25, 2021, 5:52 PM IST

Updated : Nov 26, 2021, 12:02 PM IST

new COVID19 variant

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. కరోనా కొత్త రకాన్ని కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. కరోనా నాలుగో ఉద్ధృతి (వేవ్‌) డిసెంబరు లేదా జనవరిలో వస్తుందని అంచనా వేశామని.. అయితే కొత్త వేరియంట్‌ కేసులు తాజాగా బయటపడుతున్నాయని ఆ శాఖ మంత్రి జో ఫాహ్లా తెలిపారు. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ కొత్త వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు. దీనిపై ఇంపీరియల్‌ కాలేజి లండన్‌ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ బ్రిటన్‌ను అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో ఈ వేరియంట్‌కు కొమ్ము భాగంలో ఉత్తరివర్తనాలు (మ్యుటేషన్లు) ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి కోణాల్లో ఈ రకం తీరుతెన్నులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ‘ఆందోళనకర రకం’గా పరిగణించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డేటా పరిమితంగా ఉందని దక్షిణాఫ్రికా అంటువ్యాధుల జాతీయ సంస్థ (ఎన్‌ఐసీడీ) తాత్కాలిక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆడ్రియన్‌ పురేన్‌ చెప్పారు. దీనిపై తమ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా బి.1.1.529 రకానికి సంబంధించి రెండు ఉత్పరివర్తనాలను కనుగొన్నట్లు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం క్లినికల్‌ బయాలజీ ప్రొఫెసర్‌, భారత సంతతికి చెందిన రవి గుప్తా ‘ది గార్డియన్‌’కు తెలిపారు.

క్లినికల్‌ ట్రయల్స్‌లో ఐటీసీ ‘కొవిడ్‌-19’ నాసల్‌ స్ప్రే

దిల్లీ: కొవిడ్‌-19ను నిరోధించేందుకు ఐటీసీ సంస్థ ముక్కులో వేసుకొనే నాసల్‌ స్ప్రేను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. బెంగళూరులోని ఐటీసీ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం క్లినికల్‌ ట్రయల్‌ రిజిస్ట్రీ- ఇండియా (సీటీఆర్‌ఐ) దగ్గర ఈ స్ప్రేను ఐటీసీ నమోదు చేసింది. ‘‘క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నందున దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రస్తుత సమయంలో ఇవ్వలేం’’ అని ఐటీసీ ప్రతినిధి పేర్కొన్నారు.

Last Updated :Nov 26, 2021, 12:02 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.