భారత అమ్ములపొదలోకి మరో అస్త్రం.. నౌకాదళంలోకి INS వగీర్
Updated: Jan 23, 2023, 2:26 PM |
Published: Jan 23, 2023, 2:26 PM
Published: Jan 23, 2023, 2:26 PM

భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. INS వగీర్‌ను నౌకాదళానికి అప్పగించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సబ్‌మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని.. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుందని నౌకా దళం వెల్లడించింది. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుందని నేవీ వివరించింది. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఇది. వగీర్ అంటే షార్క్ చేప అని అర్థం. ఈ పేరును 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్‌మెరైన్ నుంచి తీసుకొన్నారు. నిశ్శబ్దంగా, భయం లేకుండా పనిచేయడం INS వగీర్ ప్రధాన సామర్థ్యం. నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే ఈ జలాంతర్గామిలో అధునాతన సాంకేతికతతో భారత్ నిర్మించింది. అత్యంత నిశ్శబ్ధంగా ప్రయాణించగల ఈ సబ్‌మెరైన్ శత్రు సబ్మెరైన్లు, యుద్ధనౌకలను సులువుగా ఏమార్చగలదు. INS వగీర్ సబ్‌మెరైన్‌ను మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ నుంచి సాంకేతికత భారత్‌కు బదిలీ అయింది. ఈ సబ్‌మెరైన్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. అంతేకాదు దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం లభిస్తుంది. స్పెషల్ ఆపరేషన్ల కోసం శత్రు స్థావరాల్లోకి మెరైన్ కమాండోలను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది. సముద్రం మధ్యలో, తీరాలకు అత్యంత సమీపంలో కూడా INS వగీర్‌ను మోహరించవచ్చు. ఇందులో ఉండే అధునాతన సోనార్, రాడార్ వ్యవస్థలు ప్రత్యర్థి నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిశితంగా గమనించగలవు. యుద్ధమే వస్తే శత్రువును నిలువరించేందుకు లేదా ఎదురుదాడికి దిగేందుకు అత్యాధునిక మైన్లు, టార్పిడోలను ఇందులో పొందుపరిచారు. దీన్ని తీరానికి దగ్గరగా లేదా నడిసముద్రంలోనూ మోహరించవచ్చని అధికారులు తెలిపారు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్మెరైన్లలో ఇదొకటి. దీనిని 2020 నవంబర్లోనే ఆవిష్కరించగా నాటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. గతంలో భారత్‌లో నిర్మించిన సబ్మెరైన్లు అన్నింటిలో వగీర్నే అత్యంత వేగంగా నిర్మించారు. జలాంతర్గాముల నిర్మాణంలో భారత్ సత్తాను ఇది రుజువు చేయగలదని ప్రకటించింది. సబ్మెరైన్లలో వాగీర్‌ను అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇప్పటికే నాలుగు కల్వరీ తరగతి జలాంతర్గాములు నావికాదళంలో సేవలందిస్తుండగా ఇది ఐదోవది కానుంది. 1973 నుంచి 2001 వరకు 3 దశాబ్ధాలు నావికాదళంలో ఎన్నో ఆపరేషన్లు నిర్వహించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్ పేరునే దీనికి పెట్టారు.

1/ 13
భారత నౌకాదళంలోకి మరో జలాంతర్గామి చేరింది. INS వగీర్‌ను నౌకాదళానికి అప్పగించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సబ్‌మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని, దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుందని నౌకా దళం వెల్లడించింది.

Loading...