Moolapeta Greenfield Port Agitation: 'పోర్టు వద్దు.. మూలపేట ముద్దు..' 'గ్రీన్ఫీల్డ్' నిర్వాసితుల ఆందోళన..
Published: Aug 4, 2023, 2:07 PM

Moolapeta Greenfield Port Agitation: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోర్టు నిర్మాణానికి భూములివ్వని రైతుల పొలాలను ధ్వంసం చేయడంతో నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ధ్వంసం చేసిన పొలాల్లో రైతన్నలు నాట్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోర్టు వద్దు.. మూలపేట ముద్దు.. అంటూ రైతులు నినాదాలు చేశారు. ఇక్కడ పోర్టును వ్యతిరేకిస్తూ నేటికీ 43మంది రైతులకు చెందిన 48ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోందని భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యం చేస్తే సహించబోమని సీపీఎం నేతలు హెచ్చరించారు. అనంతరం పోలీసులు, సీపీఎం నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తహశీల్దార్ లంచాలు తీసుకుని తక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువ ఉన్నట్లు చూపించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయించారని రైతులు ఆరోపించారు.
