మహిళా దినోత్సవం వేళ మాతృమూర్తులకు నారా లోకేశ్ పాదాభివందనం
Published: Mar 8, 2023, 4:47 PM

అమ్మ లేనిదే జన్మ లేదని, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలే అని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం చింతపర్తి విడిది కేంద్రం వద్ద మహిళా దినోత్సవం వేళ మహిళలతో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. నాకు జన్మనిచ్చి ఇంత పెద్దవాడ్ని చేసిన మాతృమూర్తికి ఈ సందర్భంగా అభినందనలు అంటూ... సమావేశానికి హాజరైన మహిళలందరికీ పాదాభివందనం చేశారు. ఏనాడూ రాజకీయాల్లో లేని మా అమ్మ ని అసెంబ్లీ సాక్షిగా YSRCP నాయకులు అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని, చిన్న వయస్సు నుండే మగ వాళ్లకు మహిళా గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలన్నారు. తెలుగుదేశం ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామని లోకేశ్ హామీ ఇచ్చారు. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపని ప్రశ్నించారు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదని, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయన్నారు.

