ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం నిబంధనతో విద్యార్థుల పరుగులు
Published: Mar 15, 2023, 8:55 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి లేకపోవటంతో విద్యార్థులంతా ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు తొందరగానే చేరుకున్నారు. పరీక్షల ఈ రోజే ప్రారంభం కావటంతో కొంతమంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షలు రాసేందుకు హాజరైన వారిలో పెళ్లైన విద్యార్థులు కూడా ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో తొమ్మిది నెలల ఓ గర్భిణి కూడా ఈ పరీక్షలకు హాజరైంది. అయితే ప్రశ్నా పత్రం తీసుకుని ప్రశాంతంగా పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు అనుకోకుండా పురిటి నొప్పులు రావటం మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే 108 ద్వారా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పరీక్షలకు కొంతమంది దివ్యాంగులు కూడా హాజరయ్యారు. వీరి పరిస్థితిని గమనించిన అధికారులు వారికి అవసరమైన సహాయకులను ఏర్పాటు చేసి పరీక్షలు రాసేందుకు దోహదపడ్డారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళలకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫొటోలు చూద్దాం రండి..

