ఈ యువ హీరోలందరిదీ ఇక ఒకటే ట్రెండ్​

author img

By

Published : Sep 23, 2022, 6:46 AM IST

tollywood young actors movies list

ఏడాదిలో ఇన్ని చిత్రాలు చేయాలని ముందే నిర్ణయం తీసుకుంటారు యువ కథనాయకులు. నాని, నితిన్‌, శర్వానంద్‌ తదితరులంతా ఇలా వరుస చిత్రాలతో సందడి చేసిన వాళ్లే. కానీ, ఇప్పుడీ పరిస్థితులు తారుమారయ్యాయి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రవితేజ వంటి అగ్ర తారలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతుంటే.. పలువురు యువ హీరోలు మాత్రం ఒక్కో చిత్రంతోనే సరిపెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.

యువ కథానాయకుల సినీ డైరీలు చాలా వరకు పక్కాగానే ఉంటాయి. 'ఏడాదిలో ఇన్ని చిత్రాలు చేయాలి.. ఇన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి' అని పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతుంటారు. ఒకరకంగా సినిమా బండిని చకచకా పరుగులు పెట్టించేది వీళ్లే. అగ్ర కథానాయకులు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం ఒక్కో ఏడాది నాలుగైదు సినిమాలతో జోరు చూపిస్తుంటారు. నాని, నితిన్‌, శర్వానంద్‌ తదితరులంతా ఇలా వరుస చిత్రాలతో సందడి చేసిన వాళ్లే. కానీ, ఇప్పుడీ పరిస్థితులు తారుమారయ్యాయి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రవితేజ వంటి అగ్ర తారలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతుంటే.. పలువురు యువ హీరోలు మాత్రం ఒక్కో చిత్రంతోనే సరిపెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.

  • వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచారు కథానాయకుడు నాని. ప్రతి ఏడాదీ తన నుంచి మూడు చిత్రాలైనా విడుదల చేస్తుంటారాయన. కొవిడ్‌ పరిస్థితులు ఎదురు కాక ముందు వరకు ఆయన సినీ డైరీ ఇలా వరుస సినిమాలతోనే కళకళలాడింది. కానీ, ఇప్పుడాయన డైరీలో ఒకే ఒక్క చిత్రం కనిపిస్తోంది. అదే 'దసరా'. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రమిది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పారని, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని ప్రచారం వినిపిస్తున్నా.. ఇంత వరకు దేనిపైనా స్పష్టత రాలేదు.
  • కొత్తదనం నిండిన కథల్ని అందిపుచ్చుకోవడంలోనూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు శర్వానంద్‌. 'మహానుభావుడు' లాంటి హిట్‌ తర్వాత వరుస పరాజయాలు ఎదురవడంతో.. కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మొదలు పెట్టారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలోనూ ఒక చిత్రమే ఉంది. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం.. అక్టోబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. మరి దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు.
  • గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల సినిమాల విషయంలో కాస్త నెమ్మదించారు సాయితేజ్‌. ఆ ప్రమాదం తర్వాత కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఆయన.. పూర్తిగా కోలుకున్నాక దర్శకుడు కార్తీక్‌ దండు చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. దీని తర్వాత పవన్‌ కల్యాణ్‌ - సాయితేజ్‌ కలయికలో 'వినోదాయ సీతం' రీమేక్‌ పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, ఇంత వరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.
  • కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఇటీవలే 'మాచర్ల నియోజకవర్గం'తో మరో చేదు ఫలితాన్ని రుచి చూశారు. ఇప్పుడాయన డైరీలోనూ ఒకే ఒక్క ప్రాజెక్ట్‌ కనిపిస్తోంది. అదే వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
  • 'పెళ్లి చూపులు', 'అర్జున్‌ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా'.. ఇలా కెరీర్‌ ఆరంభంలోనే వరుస విజయాలు అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు విజయ్‌ దేవరకొండ.
  • ఆయన ఇటీవలే 'లైగర్‌'తో పాన్‌ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకొని.. దెబ్బతిన్నారు. దీంతో ఆయన సినీ డైరీలో ప్రణాళికలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. నిజానికి ఆయన అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తను ఓవైపు 'ఖుషి'తో పాటు మరోవైపు 'జనగణమన'తో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతుండేవారు. కానీ, 'లైగర్‌' దారుణ ఫలితాన్ని అందుకోవడంతో.. 'జనగణమన'ను అర్థంతరంగా పక్కకు పెట్టి 'ఖుషి'తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
  • గతేడాది దసరాకి 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'గా వచ్చి.. చక్కటి విజయాన్ని అందుకున్నారు అఖిల్‌ అక్కినేని. ఆయన ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ చిత్రం చేస్తున్నారు. అయితే దీని తర్వాత అఖిల్‌ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత రాలేదు.

కారణం ఇదేనా...:యువ కథానాయకులు సినిమాల పరంగా వేగం తగ్గించడానికి వెనక రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. వారు ఏ కథల్ని ఇష్టపడుతున్నారు? వేటిని పక్కకు పెడుతున్నారన్నది స్పష్టంగా తెలియడం లేదు. వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేసే యువ హీరోలు సైతం ఈ విషయంలో ఎదురు దెబ్బలు తినక తప్పడం లేదు. 'అంటే.. సుందరానికీ' చిత్ర విషయంలో నానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కినా వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు.

అందుకే ఇప్పుడు కథల ఎంపికలో ప్రతి హీరో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రస్తుతం యువ హీరోలు సైతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఆ తరహా కథలతో అదృష్టం పరీక్షించుకోనున్న వారు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి కథలు ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనతో వేచి చూస్తున్నారు. అందుకే ఇప్పుడు పలువురు యువ కథానాయకుల డైరీల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఈ బుడ్డోడు అమ్మాయిల మనసు దోచిన యంగ్​ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా?

RRR: మనకెందుకండి ఆస్కార్​ అవార్డ్స్​.. హీరో నిఖిల్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.