మహేశ్‌-రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్‌ ఏజెన్సీ సీఏఏ.. అసలేంటది?

author img

By

Published : Jan 20, 2023, 12:00 PM IST

Mahesh rajamouli movie what is hollywood agency

సూపర్​ స్టార్​ మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా కోసం దర్శకధీరుడు రాజమౌళి ఓ హాలీవుడ్​ ఏజెన్సీ సీఏఏతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సీఏఏ అంటే ఏంటని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. దాని గురించే ఈ కథనం..

సూపర్​ స్టార్​ మహేశ్‌బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు జక్కన్న. ఈ చిత్రం కోసం హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సీఏఏతో ఆయన ఒప్పందం చేసుకున్నారనే వార్తలు గతంలో కూడా వచ్చాయి. అసలు ఈ సీఏఏ అంటే ఏంటంటే?

సీఏఏ అంటే?.. సీఏఏ పూర్తి పేరు క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ. ప్రతిభను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. 1975 నుంచి లాస్‌ఏంజెల్స్‌ కేంద్రంగా ఈ ఏజెన్సీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రపంచంలోని ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, నటీనటులు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు.

ఆయా విభాగాల్లో (24 క్రాఫ్ట్స్‌) నిపుణులైన వీరందరినీ.. ఈ ఏజెన్సీ ఆయా చిత్ర బృందాలకు సప్లై చేస్తుంటుంది. అంటే తామో సినిమా తెరకెక్కించదలచి కథ కోసం ఏ నిర్మాతైనా దర్శకుడైనా ఏజెన్సీని సంప్రదిస్తే అక్కడ రైటర్లు స్టోరీలను అందిస్తుంటారు. అలాగే నటులు, టెక్నిషియన్లను సప్లై చేస్తారు. ఇకపోతే ఈ ఏజెన్సీ.. వెండితెరతో పాటు బుల్లితెరకు సంబంధించి బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ కూడా చేస్తుంది. కొన్నాళ్ల క్రితం క్రీడా రంగంలోనూ అడుగుపెట్టింది.

కాగా, రాజమౌళి.. తన సినిమాలను విజువల్​ ట్రీట్​గా తెరెకక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే జక్కన్న.. కేవలం గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసమే సీఏఏతో ఒప్పందం కుదుర్చుకున్నారని అంతా అనుకుంటున్నారు. ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసే ఆ నిపుణులు ఇప్పుడు తెలుగు సినిమాకు పనిచేస్తుండడం వల్ల సినీ ప్రియుల్లో తెగ ఆసక్తి రేకెత్తుతోంది.

ఇక రాజమౌళి రీసెంట్ ఇంటర్వ్యూలో మహేశ్ సినిమా గురించి మాట్లాడూతూ.. 'మహేశ్‌బాబుతో నేను చేయబోయే సినిమా పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నాం. ఈ చిత్రం కోసం సీసీఏతో ఒప్పందం చేసుకున్నా. దాని ద్వారా ప్రపంచ సినిమాను అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయమయ్యారు. ఇండియాలో ఫిల్మ్‌ మేకింగ్‌, యూఎస్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌.. రెండూ పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏం చేయాలి? సినిమా ఎలా తీయాలి? అనేదాన్ని ఫైనల్‌ చేసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది" అని రాజమౌళి తెలిపారు.

ఇదీ చూడండి: Oscars 2023: 95 ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో.. రికార్డు స్థాయిలో ఓటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.