'మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు'.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Mar 6, 2023, 9:43 AM IST

kusbhu sundar comments on sexual harassment

సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు.

ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి ఖుష్బూ సుందర్. తెలుగులోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యే జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పదవి చేపట్టారు. తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు. చిన్న వయసులోనే తన తండ్రే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలు వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నతనంలోనే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి నుంచే కావడం దారుణమని అన్నారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలుపెట్టినట్లు తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయినట్లు చెప్పారు.

"పిల్లలు వేధింపులకు గురైనప్పుడు, ఆ ఘటనను వారు జీవితాంతం మర్చిపోలేరు. అదో మచ్చగా మిగిలిపోతుంది. నా తల్లి అత్యంత దారుణమైన వివాహ జీవితాన్ని ఎదుర్కొంది. నిత్యం మా అమ్మను, మమ్మల్ని కొట్టేవాడు. నన్ను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించేవాడు. 8 ఏళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 15 ఏళ్ల వయసులో అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది. 16 ఏళ్ల వయసు వచ్చే నాటికి తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం మా అమ్మకు చెప్పలేదు. తనకు ఇప్పుడు చెప్పినా నమ్మకపోవచ్చు" అని ఖుష్బూ తెలిపారు. లైంగిక వేధింపుల గురించి ఖుష్బూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబయిలో జన్మించిన ఖుష్బూ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బర్నింగ్ ట్రైన్‌ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేశ్​ సరసన హీరోయిన్​గా నటించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. సౌత్​లో టాప్ హీరోయిన్​గా ఎదిగారు. 2010లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డీఎంకే పార్టీ ద్వారా పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.