'అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది'

author img

By

Published : Jan 20, 2023, 7:09 AM IST

Updated : Jan 20, 2023, 7:59 AM IST

actor bharath latest news

'బాయ్స్‌', 'ప్రేమిస్తే' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు భరత్​.. చాలా కాలం తర్వాత 'హంట్‌'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భరత్‌.

"చిత్ర పరిశ్రమలో మన స్థానం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకే జయాపజయాల్ని పట్టించుకోకుండా ప్రతి సినిమాతో నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నా" అన్నారు నటుడు భరత్‌. 'బాయ్స్‌', 'ప్రేమిస్తే' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. చాలా కాలం తర్వాత 'హంట్‌'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. మహేష్‌ తెరకెక్కించారు. శ్రీకాంత్‌, భరత్‌ కీలక పాత్రలు పోషించారు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ఈనెల 26న విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భరత్‌.

తెలుగులో సినిమా చేయడానికి ఇంత గ్యాప్‌ తీసుకున్నారేంటి?
"మొదటి నుంచీ నా దృష్టి తమిళ పరిశ్రమపైనే ఉంది. అక్కడే హీరోగా వరుస అవకాశాలొచ్చాయి. దర్శకుడు మహేష్‌ వచ్చి ఈ కథ చెప్పడంతో.. స్క్రిప్ట్‌, నా పాత్ర నచ్చి సినిమా చేయడానికి అంగీకరించా. అలా 12ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు చిత్రంలో నటించా. పైగా సుధీర్‌ నాకు మంచి మిత్రుడు. సీసీఎల్‌లో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాం. శ్రీకాంత్‌ కూడా నాకు అలాగే పరిచయమయ్యారు. ఈ చిత్రం ఒప్పుకోవడానికి వీళ్లూ ఓ కారణమే".

'హంట్‌' కథేంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?
"ఈ చిత్ర కథంతా మా మూడు పాత్రల (భరత్‌, సుధీర్‌బాబు, శ్రీకాంత్‌) చుట్టూనే తిరుగుతుంది. నేనిందులో ఆర్యన్‌ దేవ్‌ అనే ఐపీఎస్‌ అధికారిగా కనిపిస్తా. ప్రచార చిత్రాన్ని బట్టి.. అందరూ ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ అనుకుంటున్నారు. కానీ, ఇందులో యాక్షన్‌తో పాటు ఫ్రెండ్‌షిప్‌, ఎమోషన్స్‌ అన్నీ కలగలిసి ఉన్నాయి. తెలుగులో నా మార్కెట్‌కు చాలా ఉపయోగపడే చిత్రమిది. ఈ సినిమా కోసం నేను నా లుక్‌ కూడా మార్చుకున్నా. మహేష్‌ తమిళ్‌లో నాతో 'కాళిదాసు' చిత్రం చేశాడు. అందులో నా లుక్‌ నచ్చే.. ఈ చిత్రంలో అవకాశమిచ్చారు. మళ్లీ మా సెంటిమెంట్‌ వర్కవుటవుతుందని నమ్ముతున్నా. ఈ చిత్రంలో యాక్షన్‌ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఫైట్‌ కథతోనే ముడిపడి ఉంటుంది’’.
20 ఏళ్లలో చాలా పాత్రలు చేశారు. మీరు చేయాలని బలంగా కోరుకునే పాత్రలేవైనా ఉన్నాయా?
"అందరూ యాక్షన్‌, ఎమోషనల్‌, రొమాంటిక్‌ స్క్రిప్ట్‌లతోనే నా దగ్గరకు వస్తున్నారు. కానీ, నాకు ఓ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేయాలని ఉంది. నేనిప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. అలాగే రా ఏజెంట్‌గానూ నటించాలని ఉంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తా. తెలుగులో రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ సినిమాల్లో నటించాలని ఉంది. అల్లు అర్జున్‌తో కలిసి ఓ చిత్రం చేయాలని ఉంది. అప్పట్లో 'గంగోత్రి' తమిళ రీమేక్‌లో నేను నటించాల్సింది. కానీ, కుదర్లేదు".

స్క్రిప్ట్‌ ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కొత్త చిత్ర విశేషాలేంటి?
"నేనెప్పుడూ ఒత్తిడి తీసుకోను. జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని నమ్ముతా. నా కథలు నేనే ఎంచుకుంటాను. ఎక్కువగా సలహాలు తీసుకోను. ఎందుకంటే కథ బాగోలేదంటే శుక్రవారం మార్నింగ్‌ షో తర్వాత మన సినిమా పనైపోతుంది. ప్రస్తుతం తమిళంలో 'లవ్‌', 'మున్నరివాన్‌' అనే చిత్రాలు చేస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి".

Last Updated :Jan 20, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.