రెండు వర్గాల పాత కక్షలు.. లారీతో తొక్కించి హత్య

author img

By

Published : Sep 23, 2022, 10:18 AM IST

YSRCP LEADER MURDER

YSRCP LEADER MURDER : రెండు వర్గాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ యువకుడి దారుణ హత్యకు కారణమయిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రత్యర్థులే పథకం ప్రకారం కాపుగాచి లారీతో ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారని మృతుడి తండ్రి ఆరోపించారు.

MURDER : రెండు వర్గాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ యువకుడి దారుణ హత్యకు కారణమయ్యాయి. ప్రత్యర్థులే ఒక పథకం ప్రకారం కాపుగాచి లారీతో ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారని మృతుడి తండ్రి ఆరోపించారు. సింగరాయకొండ మండలం కనుమళ్ల జాతీయరహదారిపై గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనతో మూలగుంటపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సోమరాజుపల్లి మాజీ సర్పంచి పసుపులేటి శ్రీనివాసరావు కుమారుడు రవితేజ(32) గ్రామ వైకాపా నాయకుడు. రవితేజ మూలగుంటపాడులో నివాసముంటూ గత కొన్నాళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. ఇతరుల వద్ద ఇసుక కొనుగోలుచేసి దాన్ని విక్రయిస్తుంటాడు. గురువారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కలికివాయి నుంచి కనుమళ్ల వైపు రవితేజ, అతని మిత్రుడు ఉమ వేర్వేరు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. అప్పటికే కలికివాయి పై వంతెన వద్ద ఒక లారీ నిలిపిఉంది. వీరు కనుమళ్ల వైపు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ రవితేజ ప్రయాణిస్తున్న ద్విచక్ర వావానాన్ని ఢీ కొట్టింది. రోడ్డుపై పడిపోయిన రవితేజపై నుంచి లారీ దూసుకెళ్లింది. వెంటనే ఉమ వెంబడించగా అతనినీ ఢీకొట్టేందుకు ఢ్రైవర్‌ ప్రయత్నించాడు. అనంతరం లారీని వదిలేసి అక్కడ్నుంచి ఉడాయించాడు.

ఆ ఎన్నిక నుంచి విభేదాలు: సింగరాయకొండ మండల పరిషత్‌ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో మూలగుంటపాడు గ్రామంలో విభేధాలు నెలకొన్నాయి. స్థానిక నాయకుడు ఈ పదవికి పోటీపడగా, రవితేజ మరో ఎంపీటీసీకి అనుకూలంగా వ్యవహరించాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పదవిని ఆశించిన నాయకుడి కుమారుడిపై రవితేజ వర్గీయులు దాడిచేసి కొట్టారనే అభియోగాలు వచ్చాయి. అప్పట్లో స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.

ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారు కావడంతో నేతలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చినప్పటికీ అంతర్గతంగా విభేధాలు ఉన్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్నది పదవి ఆశించి భంగపడిన నాయకుడి కుమారుడేనని ప్రత్యక్ష సాక్షి ఉమ చెప్పినట్లు రవితేజ తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌, ఎస్సై ఫిరోజా ఫాతిమా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కందుకూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

గ్రామంలో ఉద్రిక్తత : రవితేజ హత్య ఘటనతో మూలగుంటపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవితేజ వర్గీయులు ఆందోళనకు దిగారు. స్టేషన్ వద్ద ఉన్న లారీకి నిప్పు పెట్టేందుకు యత్నించి.. పక్కనే ఉన్న చలివేంద్రాన్ని తగలబెట్టారు. ఆందోళన దృష్ట్యా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.