బైక్ లిఫ్ట్ అడిగాడు... పాపమని సాయం చేస్తే.. అంతలోనే

author img

By

Published : Sep 19, 2022, 2:23 PM IST

Updated : Sep 19, 2022, 5:18 PM IST

Man killed a biker in Khammam

Man killed a biker in Khammam : రోడ్డు మీద ఎవరైనా లిఫ్ట్ అడిగితే మానవత్వంతో మనం అటువైపే పోతున్నామని ఆపి ఎక్కించుకుంటాం. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగానే ద్విచక్రవాహనదారుడు ఆపి అతడిని బైక్ ఎక్కించుకున్నాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ దుండగుడు చేసిన పనికి ఏకంగా ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Man killed a biker in Khammam: మంచికిపోతే చెడు ఎదురవ్వడమంటే ఇదేనేమో.. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి రూపంలోనే మృత్యువు వస్తుందని ఊహించలేదు. వాహనాలరద్దీ లేని రహదారి కదా.. సాటిమనిషికి సాయం చేద్దామనుకుంటే అతడే కాలనాగై సూదిమందు రూపంలో కాటేయడంతో మృత్యుఒడికి చేరిన విషాదాంతమిది. మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపైనే సూదిమందు దాడిచేసి హతమార్చాడో దుండగుడు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఆ దారుణ ఘటనతో.. మృతుడి కుటుంబాన్ని తీరనిశోకంలోకి నెట్టగా.. మిస్టరీగా మారిన కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్.. ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న.. కూతురు ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. ముదిగొండ మండలం వల్లభికాటమయ్య దేవస్థానం సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న.. ఓ వ్యక్తి చేయిచూపి జమాల్ సాహెబ్‌ను లిఫ్ట్ అడిగాడు. సాటిమనిషికి సాయం చేద్దామన్న సదుద్దేశంతో.. జమాల్ సాహెబ్ గుర్తు తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బైక్ కదిలి 100 మీటర్లు వెళ్లిందో లేదో గుర్తుతెలియని వ్యక్తి బైక్ దిగి మరో వాహనంపై వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే కిందపడిపోయిన సాహెబ్‌ను గమనించిన స్థానికులు వల్లభి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తానూ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. తనకు ఇంజిక్షన్ చేశాడని బాధితుడు స్థానికులకు చెప్పాడు. తన కుటుంబీకులకు ఫోన్ చేయమని వారికి సెల్‌ఫోన్ ఇచ్చాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు.

అంతుచిక్కని రీతిలో చోటు చేసుకున్న ఆ ఘటనతో జమాల్ సాహెచ్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జమాల్ సాహెబ్‌కు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని.. ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదని రోదిస్తున్నారు. ఘటనా స్థలిలో ద్విచక్రవాహనంతోపాటు సూది దొరకడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. సూదిమందుతో హత్యకు ఎవరు పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. అసలు లిప్ట్ అడిగిన వ్యక్తి ఎవరు.. జమాల్ సాహెబ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది. ఇంజిక్షన్‌తో విషం ఇచ్చారా.. లేక మరేమైనా ఉందా అంతుచిక్కడం లేదు. జమాల్ సాహెబ్ మృతి మాత్రం అనుమానంగానే ఉందని పోలీసులు తెలిపారు.

సూదితో వ్యక్తిని హతమార్చిన ఘటన స్థానికులతోపాటు జిల్లావాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. హత్య కేసును పోలీసులు త్వరగా ఛేదించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

Last Updated :Sep 19, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.