వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మళ్లీ ప్రమాదం, ఇద్దరు మృతి

author img

By

Published : Aug 29, 2022, 2:51 PM IST

Updated : Aug 30, 2022, 6:59 AM IST

BLAST AT SUGAR INDUSTRY

14:47 August 29

Boiler Blast ప్యారీ షుగర్స్‌లో పేలిన బాయిలర్‌

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మళ్లీ ప్రమాదం

BLAST AT SUGAR INDUSTRY: కాకినాడ శివారు వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ సుగర్స్‌ రిఫైనరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కె.గంగవరానికి చెందిన పేరూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (34), గొల్లప్రోలుకు చెందిన రాగం ప్రసాద్‌ (31) అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు కార్మికులు శ్రీనివాసరావు, వినయ్‌కుమార్‌ త్రుటిలో తప్పించుకున్నారు. చక్కెర శుద్ధి ప్రాంగణంలోని ఓ యూనిట్‌లో వ్యాక్యూమ్‌ ఒత్తిడిలో తేడాల కారణంగా నాలుగో అంతస్తులోని యంత్రాలు.. మొదటి అంతస్తులోకి పడిపోయాయి.

అక్కడ యంత్రాల మరమ్మతుల్లో నిమగ్నమైన సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రసాద్‌ దుర్మరణం పాలయ్యారు. ఇదే పరిశ్రమలో ఈనెల 19న జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. నాటి ప్రమాద నివేదిక ఉన్నతాధికారులకు అందకముందే మరో దుర్ఘటన జరగడంతో పర్యవేక్షణలోపం, యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్మాగారాల విభాగం డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ వచ్చి పరిశీలించారు. పరిశ్రమను మూసేయాలని ఆదేశించామని, ప్రమాదాలపై నివేదికలు పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా చెప్పారు.

వరుస ప్రమాదాలపై వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగగా, ఏఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియంత్రించారు. పరిశీలనకు వచ్చిన కాకినాడ ఎంపీ వంగా గీతను కార్మికులు నిలదీశారు. మృతదేహాలను అనాథ శవాల్లా జీజీహెచ్‌లో వదిలేశారని, యాజమాన్యం జాడే లేదని మండిపడ్డారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని గీత నచ్చజెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 కోట్లు చొప్పున పరిహారం ఇవ్వాలని పిఠాపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 30, 2022, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.