పంటకు తెగుళ్ల దెబ్బ.. మోయలేని అప్పుల బాధ.. పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

పంటకు తెగుళ్ల దెబ్బ.. మోయలేని అప్పుల బాధ.. పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
FARMER SUICIDE IN GUNTUR : పంట పండించడం తప్ప మరో పని తెలియని రైతులపై కాలం కన్నెర్ర జేస్తోంది. ఎన్ని సార్లు నష్టం వచ్చినా.. ఈ సారైనా పంట రాకపోతుందా.. చేసిన అప్పులు తీర్చకపోతామా.. అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తే.. మళ్లీ అదే నిరాశ . అప్పుల భారం పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం లేక.. కుటుంబ పోషణ భారమై తనువులు చాలిస్తున్నారు. తాజాగా ఓ రైతు చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో జరిగింది.
FARMER SUICIDE : భూమాతను నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసి బతుకుతున్న రైతులకు అప్పులు మనోవేదనను మిగులుస్తున్నాయి. పంట చేతికి రాక.. ఒకవేళ వచ్చినా గిట్టు బాటు ధర లేక ఎందరో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారన్నా మంచి దిగుబడి వచ్చిద్ది అనుకున్న సమయానికి కాలం కన్నెర్ర చేసి ప్రకృతి రూపంలో ఆటంకాలు సృష్టించి నిలువునా ముంచితే.. ఆ అన్నదాత వేదనను తీర్చేవారు ఎవరూ. ప్రతి సంవత్సరానికి పెరుగుతున్న అప్పులు ఆ రైతన్నను కుదురుగా ఉండనివ్వకపోతే.. ఆ కర్షకుడిని ఆదుకునే నాథుడు ఎవ్వడు.
రైతుల సంక్షేమానికే తమ పెద్దపీట అని ఊదరగొట్టే ప్రభుత్వాలు వారిని కష్టకాలంలో ఎందుకు ఆదుకోవడం లేదు. మాటలతో కాలక్షేపం చేసే ప్రభుత్వాలు ఉన్నంతకాలం.. రైతుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడదు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ప్రాణాలు తీసుకున్న ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో జరిగింది. ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడుకు రాజవరపు శ్రీనివాసరావు అనే రైతు.. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
బంధువులు ఆయన్ని చికిత్స కోసం మొదట సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి శుక్రవారం గుంటూరుకు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆయన చనిపోయారు. శ్రీనివాసరావు.. 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ప్రత్తి, పొగాకు పంటలు వేశారు. వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతింది. 6 లక్షల రూపాయల వరకూ అప్పు తీసుకున్న ఆయనకు... తీవ్ర నష్టం వాటిల్లడంతో మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇవీ చదవండి:
