Rains: ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Sep 13, 2022, 2:51 PM IST

Updated : Sep 13, 2022, 9:39 PM IST

Heavy Rains In North AP

Heavy rains: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సామాన్య జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వర్షాల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు నాగావళి, వంశధార, బహుదా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి.

Heavy Rains In North AP: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంశధార, నాగావళి, బహుదా నదులు ఉగ్రరూపం దాల్చడంతో.. పల్లెలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు తడిచి ప్రజలు ఇబ్బంది పడ్డారు.

ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాన జోరుతో రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటివద్ద భారీ వృక్షం నేలకొరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం అంపోలు రోడ్డుకు ఆనుకొని ఉన్న జాతీయ రహదారికి పైకి వరదనీరు చేరగా..చాలా వాహనాలు నీట మునిగాయి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెక్కలిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సంతోషిమాత ఆలయ మార్గంలో వరద నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు వీధుల్లో వర్షపునీరు ఆగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పెద్ద బ్రాహ్మణ వీధి వెనుక ఉన్న రాచబండ నిండిపోయి గట్టుపై ఉన్న ఇళ్ల మీదుగా వర్షపునీరు ప్రవహించింది. నందిగాం మండలం కాపు తెంబూరులో పిడుగు పాటుకు ఓ రైతు మృతిచెందాడు. బాధిత రైతు కొల్లి వనజనాభంను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన వనజనాభం పిడుగు పాటుకు బలవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

"వరద నీరు ఇళ్లలోకి చేరి ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి. వంట చేసుకోడానకి వీలు లేకుండా వరద నీళ్లు వచ్చాయి. నిత్యావసర సరుకులు తడిచిపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము".

- శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామస్థులు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి.. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జాతీయ రహదారిపై నీరు నిలిచి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. సిబ్బందితో కలిసి శ్రీకాకుళం నగరపాలక కమిషనర్ ఓబులేసు రంగంలోకి దిగారు. క్రేన్ల సాయంతో కాలువలు, చెరువుల్లోకి నీటిని మళ్లించారు.

విశాఖలో 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురం ప్రజలు.. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిక్కుబిక్కుమంటున్నారు. నల్లకాలవ నుంచి.. ముడసర్లోవ వెళ్లే గెడ్డ పొంగి.. పక్కనున్న ఇళ్లను ముంచెత్తింది. ఇళ్లలోని సామాన్లు తడిసిపోయాయని .. స్థానికులు వాపోతున్నారు.

"కాలువలు నిర్మించకపోవటం ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. నీళ్లు రావటం వల్ల ఇంట్లోని సామాన్లు తడిచిపోయాయి. చిన్నపిల్లలు నీటిలో పడిపోతారని భయంగా ఉంది. అధికారులు స్పందించి వరదనీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాలి". -విశాఖలో 13వ వార్డు పరిధిలోని రామకృష్ణాపురం ప్రజలు

ఇవీ చదవండి:

Last Updated :Sep 13, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.