PROTEST ON PROBATION: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ పోరాటం.. నేడు విధుల బహిష్కరణ

author img

By

Published : Jan 10, 2022, 5:01 AM IST

Updated : Jan 10, 2022, 6:19 AM IST

PROTEST ON PROBATION

SACHIVALAYA EMPLOYEES PROTEST ON PROBATION: ప్రొబేషన్ ప్రకటించాలంటూ ఆందోళన బాట పట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. నేడు విధులు బహిష్కరించనున్నారు. ఉద్యోగులంతా నల్ల రిబ్బన్లు ధరించి సచివాలయాల ముందు నిరసన తెలియజేయనున్నారు. అరకొర వేతనాలతో తీవ్ర అవస్థలు పడుతున్నామన్న ఉద్యోగులు.. ప్రభుత్వంతో నేటి చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

SACHIVALAYA EMPLOYEES PROTEST ON PROBATION: ఉద్యోగంలో చేరి రెండేళ్లయినా ప్రొబేషన్‌ ఖరారవ్వక, చాలీచాలని జీతంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు సంస్థల్లో మంచి జీతం కాదనుకుని, ప్రభుత్వ ఉద్యోగం కావడంతో విధుల్లో చేరారు. ప్రొబేషన్‌ ఖరారైతే జీతం పెరుగుతుందని ఆశించారు. అయితే సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ జూన్‌ 30లోగా పూర్తి చేస్తామన్న సీఎం జగన్ తాజా ప్రకటనతో.. తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న సచివాలయాల ఉద్యోగులు.. నేడు విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు.

జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసినందున.. ప్రొబేషన్‌ ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేస్తారని 2021 సెప్టెంబర్ 29న సర్క్యులర్‌ జారీ చేశారు. 2021 డిసెంబర్ 17న విడుదల చేసిన మరో సర్క్యులర్‌లో.. ప్రొబేషన్‌ ఖరారు చేయదలచిన ఉద్యోగుల జాబితాలను కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి విభాగాధిపతులకు పంపాలని సూచించారు.

వీటిని ప్రభుత్వం ఆమోదించాకే ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారైనట్లు భావించి.. సవరించిన వేతనాలు అమలు చేయాలని వార్డు, సచివాలయాల శాఖ పేర్కొంది. ఇక ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేస్తే ఒక్కో ఉద్యోగికి నెలకు సుమారు రూ. 25వేల జీతం చెల్లించాల్సి ఉంటుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ. 336 కోట్లు అవసరం. ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత భారమనే ఉద్దేశంతో ప్రొబేషన్‌ ఖరారులో జాప్యం చేస్తున్నారా అని ఉద్యోగులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో... ప్రైవేటు సంస్థలో రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు వేతనాన్ని కూడా వదులుకొని కొందరు సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. అలాంటి వారు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు ప్రభుత్వం ఇచ్చే రూ. 15 వేలు.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, రోజువారీ ఖర్చులకు కూడా సరిపోక అప్పులతో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేయకుంటే మరింత గడ్డు పరిస్థితులు తప్పవని వాపోతున్నారు.

సచివాలయాల్లో చేరిన వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సంక్షేమ కార్యక్రమాలకు కూడా అనర్హులుగా తేల్చారని... ఇప్పుడు రెండేళ్లు దాటినా జీతాలు పెంచకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో.. నేడు ప్రభుత్వం చర్చించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌తో... సంఘాల నాయకులు సచివాలయంలో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి:

Attack: ప్రేమను తిరస్కరించిందని ఆగ్రహం.. బాలిక గొంతు కోసిన యువకుడు

Last Updated :Jan 10, 2022, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.