'గడప గడపకు ప్రభుత్వం'పై.. విపక్షాల అసత్య ప్రచారం: సజ్జల
Updated on: May 13, 2022, 5:49 AM IST

'గడప గడపకు ప్రభుత్వం'పై.. విపక్షాల అసత్య ప్రచారం: సజ్జల
Updated on: May 13, 2022, 5:49 AM IST
YSRCP Gadapa Gadapaku Program: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలను నిలదీసే వారంతా తెలుగుదేశానికి చెందిన వారేనని సజ్జల పేర్కొన్నారు.
‘రైతుల మోటార్లకు మీటర్లను బిగించి ఉచిత విద్యుత్తును తీసేస్తారంటూ వారిలో అనుమానాలు, అపోహలను సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘ఉచిత విద్యుత్తును తీసేయాలనుకుంటే మీటర్లతో సంబంధం లేకుండానే తీసేసేవాళ్లం కదా? రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్తు అందించాలని, అది తమ హక్కు అనే పరిస్థితి తేవాలనుకోవడం తప్పా? రైతుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అవుతుంది. అక్కడ నుంచి డిస్కంలకు బదిలీ కాకపోయినా రైతుల విద్యుత్ కనెక్షన్లను తొలగించరు. మీటర్ల ఏర్పాటు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. దానివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్తు వాడుతున్నారో తెలియడమే కాదు. డిస్కంలకు బాధ్యత తెలుస్తుంది. దీంతోపాటు కేంద్రం నుంచి ఆర్థికంగా కలిగే వెసులుబాటును రాష్ట్రం వినియోగించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంవద్ద విలేకరులతో మాట్లాడారు.
పథకాలు రాలేదనడానికి అవకాశం లేదు
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నించడం, వైకాపా కార్యకర్తలూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంపై విలేకరులు ప్రశ్నించగా... ‘ప్రశ్నిస్తున్నది తెదేపా కార్యకర్తలే. తెదేపావారి ఇళ్లకూ వెళ్లాలనే ఎమ్మెల్యేలకు సీఎం చెప్పారు. సంతృప్తకర స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నప్పుడు ఎవరూ పథకాలు రాలేదని అనడానికి అవకాశం ఉండదు. కావాలంటే ఒక రోజు ఎమ్మెల్యేల వెంట తెదేపావాళ్లు వెళ్లి ప్రజలు ఏమంటున్నారో రికార్డు చేసుకోవచ్చు’ అని సజ్జల సవాలు చేశారు. ‘వైకాపా కార్యకర్తలకు అసంతృప్తి ఉండే అవకాశం లేదు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో వారి కార్యకర్తలకు రూ.15వేల కోట్లను దోచిపెట్టింది. అది చూసి తమకూ అలా వస్తుందనుకునే వాళ్లే ఇప్పుడు అసంతృప్తికి గురై ఉండొచ్చు’ అని తెలిపారు.
ఇదీ చదవండి:
