తడ'బడి'న విలీనం.. మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు

author img

By

Published : Aug 1, 2022, 4:16 AM IST

మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు

పాఠశాలల విలీనం పలు చోట్ల విద్యార్థులను కష్టాలపాలు చేస్తోంది. అదనంగా గదులు లేకపోయినా 3,4,5 తరగతులను తరలించడంతో చెట్ల కింద, వరండా, రేకులషెడ్లలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల గదులు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా సౌకర్యాలు లేక కొందరిని బెంచీలపై, మరికొందరిని నేలపై కూర్చోబెడుతున్నారు.

పాఠశాలల విలీనం పలు చోట్ల విద్యార్థులను కష్టాలపాలు చేస్తోంది. అదనంగా గదులు లేకపోయినా 3,4,5 తరగతులను తరలించడంతో చెట్ల కింద, వరండా, రేకులషెడ్లలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల గదులు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా సౌకర్యాలు లేక కొందరిని బెంచీలపై, మరికొందరిని నేలపై కూర్చోబెడుతున్నారు. ‘నాడు-నేడు’ మొదటి విడతలో అదనపు తరగతి గదులు నిర్మించలేదు. చాలావరకు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యార్థులకే వసతులు సరిపోతాయి. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల పిల్లలూ వస్తుండడంతో గదుల సమస్య ఏర్పడుతోంది. విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలనుంచి 6,7,8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలుపుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో క్షేత్రస్థాయి సదుపాయాలను విస్మరిస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, ప్రధాన రహదారులను దాటి వెళ్లాల్సి వస్తున్నా పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు గట్టిగా వ్యతిరేకిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదఇర్లపాడు ప్రాథమిక పాఠశాలను కిలోమీటరు దూరంలోని జడ్పీ పాఠశాలలో విలీనం చేశారు. 60 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలకు రావడంతో విద్యార్థుల సంఖ్య 450కి చేరింది. గదులు సరిపోక హెచ్‌ఎం, డిజిటల్‌ గదుల్లో బోధిస్తున్నా సరిపోవడం లేదు. విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్నారు. మధ్యాహ్నభోజనం సమయంలోనూ అవస్థలు తప్పడం లేదు.

సుమారు 80 మంది 3, 5 తరగ తులకు చెందిన పిల్లలతో కిక్కిరిసి ఉన్న పై తరగతి గది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు ఉన్నత పాఠశాలది. ఈ బడిలో రెండు పాఠశాలలను కలిపారు. 3,4,5 తరగతులకు చెందిన 155 మంది విద్యార్థులు వచ్చారు. ఈ పాఠశాలలో గతంలోనే గదుల కొరతతో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చినవారికి గదులు, కూర్చోవడానికి బల్లలు లేవు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 700 మంది విద్యార్థులున్నారు.

విలీనం తర్వాత గదుల నిర్మాణమా ?: రాష్ట్రవ్యాప్తంగా 4,108 ఉన్నత పాఠశాలల్లో 27,770 తరగతి గదులు నిర్మించేందుకు ప్రభుత్వం పాలన అనుమతులిచ్చింది. ఇవికాకుండా 1,186 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,300 గదులు అవసరమని పేర్కొంది. ఈ లెక్కన 31వేలకుపైగా గదుల అవసరం ఉంది. ఇందుకోసం రెండో విడత ‘నాడు-నేడు’లో కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికీ పూర్తిస్థాయి పనులు ప్రారంభించనే లేదు. గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈసమస్యలు కొంతవరకైనా పరిష్కారమయ్యేవి.

.
  • గతేడాది 3,637 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను పావు కి.మీ.దూరంలోని 3,178 ఉన్నత పాఠశాలల్లో కలిపారు.
  • ఈ ఏడాది కి.మీ.దూరంగా నిర్ణయించి 5,250 ప్రాథమిక పాఠశాలలనుంచి తరగతులను మ్యాపింగ్‌ చేశారు. వీటిల్లో సుమారు 500 పాఠశాలల్లో సమస్యలున్నట్లు ఎమ్మెల్యేలు లేఖల్లో విన్నవించారు. కి.మీ.దూరమని పేర్కొన్న కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువ దూరమున్నా మ్యాపింగ్‌ చేసేశారు.
  • 3,4,5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధిస్తామంటున్నా ప్రస్తుతం చాలాచోట్ల మిగులు ఏర్పడిన ఎస్జీటీలనే సర్దుబాటు చేస్తున్నారు. వీరితోనే పాఠాలు చెప్పిస్తున్నారు.
  • సబ్జెక్టు ఉపాధ్యాయులు 12-16ఏళ్ల మధ్య పిల్లలకు బోధించేందుకు శిక్షణ పొంది ఉంటారు. వీరు పదేళ్లలోపు పిల్లలకు బోధించాలంటే వారి మనస్తత్వం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బీఈడీ చేసిన వారు ప్రాథమిక తరగతులకు బోధించేందుకు బ్రిడ్జి కోర్సులాంటివి పూర్తి చేయాలి. చాలా మందికి ఈ అర్హత లేదు.
  • సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన అంటున్న విద్యాశాఖ 98 మందికంటే తక్కువ ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్జీటీలతోనే బోధిస్తామని హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ ఈ హామీ ఎలా నెరవేరుతుంది?
  • ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు తరలించడంతో మిగిలే 1,2 లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చేరుతున్నారు. ఆయా విద్యాలయాల్లో కేవలం 5-10మంది పిల్లలే మిగిలి వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కి.మీ.దూరంలోని ఉన్నత పాఠశాలలకు తరలించి అక్కడ సబ్జెక్టు ఉపాధ్యాయులతోనే బోధిస్తాం. సదుపాయాలున్న చోటే తరగతులను విలీనం చేస్తాం. - మంత్రి బొత్స సత్యనారాయణ

మ్యాపింగ్‌ చేసిన ప్రాథమిక పాఠశాలలనుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాల్సిందే. జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. - క్షేత్రస్థాయిలో డీఈఓ, ఎంఈఓలు

.
.
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.