Crop Insurance: పంటల బీమా.. అగమ్యగోచరం

author img

By

Published : Jun 20, 2022, 7:46 AM IST

free Crop Insurance problems to farmers

Crop Insurance: ఉచిత పంటల బీమా అంతా అగమ్యగోచరంగా తయారైంది. ఈ-పంటలో నమోదు చేసినా బీమా రాలేదని కొందరు.. ఈ-కేవైసీ చేసినా సమాచారం గల్లంతైందని మరికొందరు రైతులు వాపోతున్నారు. ఈ-పంటలో నమోదై, ఈ-కేవైసీ చేయించుకోని వారందరికీ మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Crop Insurance: ఉచిత పంటల బీమా అంతా అగమ్యగోచరంగా తయారైంది. ఈ-పంటలో నమోదు చేసినా బీమా రాలేదని కొందరు.. ఈ-కేవైసీ చేసినా సమాచారం గల్లంతైందని మరికొందరు రైతులు వాపోతున్నారు. ఈ-పంటలో నమోదై, ఈ-కేవైసీ చేయించుకోని వారందరికీ మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్‌ హరికిరణ్‌ వరకు అంతా పారదర్శకమే అంటున్నా.. ఎక్కడ ఏ పంటకు ఎంత పరిహారం ఇచ్చారనే వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచడానికి ఎందుకు వెనకాడుతున్నారని రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.50వేల లోపు మంజూరైన వారికే జమయ్యాయి.

అంతకుమించి మంజూరైన వారికి ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారనే సమాచారమూ లేదు. చాలాచోట్ల అర్జీలు తీసుకోవడం లేదు. ఈ-పంట విధానంలో లోపాలున్నాయని వ్యవసాయాధికారుల నుంచి అంతా అంగీకరిస్తున్నారు.

ఈ-పంట, ఈ-క్రాప్‌ 100% వాస్తవమా?.. ఈ-పంట నమోదు తప్పులతడకగా ఉందని వ్యవసాయ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. సాగు చేయని రైతుల పేర్లతో ఈ-క్రాప్‌ చేశారని ప్రకాశం జిల్లాలోని పలు రైతుభరోసా కేంద్రాల వద్ద కర్షకులు ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లాలో కొండలు, గుట్టలను కూడా పంట భూములుగా చూపించి పరిహారం ఇచ్చారు.

  • ఈ-కేవైసీ చేసినా తర్వాత సమాచారం కనిపించడం లేదని, వేలిముద్ర వేయనట్లే కనిపిస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని కొందరు రైతుభరోసా కేంద్రాల సిబ్బందే చెబుతున్నారు. సర్వర్‌ ఇతర సమస్యలతో వేలిముద్రలు నమోదు కాలేదు. ఇలాంటి లోపాలకు తమను బాధ్యుల్ని చేసి నష్టపరిహారం ఇవ్వకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
  • గతంలో ఈ-క్రాప్‌ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచేవారు. అప్పుడు సర్వే నంబర్ల వారీగా చూస్తే శ్మశానాలు, వాగులు, రోడ్లు, చెరువుల్ని కూడా సాగు భూములుగా నమోదుచేసిన వైనం బయటపడింది. ఎక్కడా సెంటు సాగు లేకున్నా.. ప్రకాశం జిల్లాలో దాల్చిన చెక్క వేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఇలాంటి లోపాలను సరిదిద్దకుండా.. ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
  • వాస్తవానికి మండలంలో మొత్తం సాగువిస్తీర్ణం, ఈ-క్రాప్‌లో నమోదైన విస్తీర్ణం సరిపోవాలి. చాలాచోట్ల పెద్దఎత్తున వ్యత్యాసం ఉంది. ఎవరి పేరుతో ఎంత పంట విస్తీర్ణం నమోదైందనే వివరాలను మాత్రం తెలియనీయట్లేదు. రసీదులూ ఇవ్వట్లేదు. గతేడాది ఈ-పంట నమోదు పేరుతో ఒకసారి, ఈ-కేవైసీ పేరుతో మరోసారి, పొలంలో ఫొటో కావాలంటూ ఇంకోసారి సాగదీయడమూ సమస్యలను సృష్టించింది.

కావాలనే లెక్క తగ్గించారా?.. పంటల బీమాపై గతంలో చెప్పిన లెక్కలకు, ఇప్పుడు పరిహారం మంజూరైన జాబితాలకు భారీగా తేడా ఉందని కొందరు వ్యవసాయ అధికారులే అంగీకరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తొలుత 4,814 మంది రైతుల పేర్లతో అర్హుల జాబితా ఇవ్వగా.. తర్వాత 2,129 మందికే వర్తించింది. ఇలా చాలా మండలాల్లో లెక్కలు తప్పాయి.

కాల్‌సెంటర్‌ ఉత్తుత్తిదే!.. పంటల బీమా అందకపోయినా, అనర్హులకు సాయం అందినా, విస్తీర్ణం తప్పుగా నమోదైనా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అర్జీలు ఇవ్వచ్చని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. అయినా ఇప్పటికీ చాలాచోట్ల అర్జీలు తీసుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో నమోదుచేసే వ్యవస్థ లేదు. వ్యవసాయశాఖ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే.. గ్రామ సచివాలయంలో అర్జీ ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో తమ ఇబ్బందులను ఎవరికి చెప్పాలనే ప్రశ్న రైతుల నుంచి వస్తోంది.

గుంటూరు జిల్లాలో మిరప వర్షాధారమా?.. మిరప రైతులకు సాయం విషయంలో స్పష్టత లేదు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప వాతావరణ ఆధారిత బీమా పథకం కింద ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే సాయం అందలేదని వివరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మిరప వేసే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 90%పైగా విస్తీర్ణం నాగార్జునసాగర్‌, గుండ్లకమ్మ ఆయకట్టుతోపాటు ఎత్తిపోతల పథకాల కిందనే ఉంటాయి. రైతుల నుంచి ఏటా నీటితీరువా కూడా వసూలు చేస్తున్నారు. అయినా వర్షాధారం అని ఎలా నమోదు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

వ్యవసాయ సహాయకులకు సరైన అవగాహన లేకపోవడంతో.. చాలాచోట్ల మిరపను వర్షాధార సాగుగా ఈ-పంటలో నమోదు చేశారు. దీన్ని ముందే గుర్తించిన అధికారులు కమిషనరేట్‌ దృష్టికి తెచ్చినా సరిదిద్దలేదు. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాధార సాగుకింద నమోదైన వారి పేర్లు పరిహారం జాబితాలోకి రాలేదు. నిజానికి 2019 ఖరీఫ్‌ నాటి వాతావరణ ఆధారిత బీమా నిబంధనలు పరిశీలిస్తే.. అందులో ఎక్కడా నీటిపారుదల కింద సాగు అనేదే లేదు.

కొత్తగా 2022 ఖరీఫ్‌లోనే దీన్ని పొందుపర్చారు. వాతావరణ ఆధారిత బీమాలో తెగుళ్లకు అనుకూల వాతావరణానికి పరిహారం చెల్లింపు అంశం ఉంది. గతేడాది మిరపను వైరస్‌ ఆశించింది. నల్లతామర పురుగు నష్టపరచింది. వీటికి వాతావరణ పరిస్థితులే కారణం. ప్రభుత్వం నిజంగానే నష్టపరిహారం ఇవ్వాలని అనుకుంటే.. ఈ కోణంలో అయినా పరిహారం మంజూరు చేయొచ్చని రైతు నేతలు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.