కృష్ణా, గోదావరి కలుషితం కాకుండా.. పటిష్ట చర్యలు : సీఎం జగన్

author img

By

Published : Jun 20, 2022, 7:08 PM IST

cm jagan review

CM Jagan Review: రాష్ట్రంలో ప్రధాన నగరాలు, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. మురుగునీటి వల్ల కృష్ణా, గోదావరి నదులు కలుషితం కాకుండా పటిష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్న ఆయన.. మురుగునీటి శుద్ధికోసం తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులపై జగన్​ సమీక్షించారు.

రాష్ట్రంలో మురుగునీరుతో కృష్ణా, గోదావరి నదులు కలుషితం కాకుండా పటిష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మురుగునీటి శుద్ధికోసం తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలు, విజయవాడలో కాలువల సుందరీకరణపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా.. పురపాలక శాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. విజయవాడ, విశాఖపట్నంలో విమానాశ్రయాలకు వెళ్లే రహదారులను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం చర్చించారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఆలోగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పారు.

జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి.. : నగరపాలక, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపైనా సీఎం సమీక్షించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 51.92 శాతం పనులు పూర్తయ్యాయని, జులై 15 నాటికి రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. "మురుగు జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మురుగు శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలి. ఈ ప్రాజెక్టుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలుతాం. ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. ఆ ఉద్దేశంతోనే సిబ్బంది వేతనాలను రూ.12 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాం" అని జగన్‌ తెలిపారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటకాల్వల్లో చెత్త , ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మ్యాపింగ్‌ చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.

ప్రతీ నియోజకవర్గంలో స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌..: జగనన్న హరిత నగరాలు, స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌పై సీఎం సమీక్షించారు. "రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలి. ప్రతి నియోజకవర్గంలో స్మార్ట్‌టౌన్‌షిప్స్‌ ప్రారంభం కావాలి. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తిచేయాలి. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి. జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నాం. పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేయాలి. అవి సమర్థంగా నడిచేలా చర్యలు తీసుకోవాలి" అని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇదీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.