cm jagan on parishad results: 'ఈ అఖండ విజయం..మా బాధ్యతను పెంచింది'

author img

By

Published : Sep 20, 2021, 1:03 PM IST

Updated : Sep 21, 2021, 4:22 AM IST

ముఖ్యమంత్రి జగన్​

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై జగన్​ మీడియా సమావేశం నిర్వహించారు.

‘ఈ అఖండ విజయం ప్రభుత్వంపై, నాపై బాధ్యతను మరింత పెంచింది. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజేతలకు అభినందనలు తెలిపారు. ‘ఇకపై మరింత కష్టపడతాం. మరింత మేలు చేసే క్రమంలో ప్రతి అడుగూ ముందుకే వేస్తామ’ని తెలిపారు. పరిషత్తు ఎన్నికల
ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రాష్ట్ర ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు. ‘2019 సాధారణ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలకు 151 చోట్ల వైకాపా అభ్యర్థులను గెలిపించారు.

ఇది 86 శాతం. 25 ఎంపీ సీట్లలో 22 మంది వైకాపా తరఫున గెలిచారు. ఇది 87 శాతం. 50 శాతానికి మించి ఓట్లతో ఈ ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో 13,081కి గానూ 10,536 పంచాయతీల్లో (81%) వైకాపా మద్దతుదారులను ప్రజలు గెలిపించారు. పురపాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికల్లో 75కి 74 మాకే దక్కాయి. 12కి 12 నగరపాలక సంస్థల్లోనూ వైకాపాకు ప్రజలు పట్టంగట్టారు. తాజాగా 638 జడ్పీటీసీ స్థానాలకు 628 చోట్ల (98%), 9,583 ఎంపీటీసీలకు 8,249(86%) స్థానాల్లో గెలిపించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 2019 నుంచి అన్ని ఎన్నికల్లో ప్రజల దీవెనలతో ఈ విజయాలు దక్కుతుంటే.. కొందరు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతానికిపైగా ఈ రెండున్నరేళ్లలోనే చేయగలిగాం. అయినా ప్రభుత్వానికి ఇబ్బందులు కల్పించాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

పార్టీల గుర్తులతో జరిగిన ఎన్నికలివి:

‘పరిషత్తు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. తెదేపా ఎన్నికలను బహిష్కరించడంతో వైకాపా సునాయాసంగా గెలిచిందంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. వాస్తవానికి ఇవి పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు. ప్రతి పార్టీ.. తమ అభ్యర్థులకు ఎ, బి ఫారాలు ఇచ్చింది. వాటి ఆధారంగానే ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఆ గుర్తులతోనే ఎన్నికలు జరిగాయి. ప్రజలంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు మంచి చేసేందుకు వేస్తున్న అడుగులకు ప్రతిపక్షాలు అన్యాయంగా అడ్డుపడుతున్నాయి. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలను చూస్తున్నాం. ఈ ఎన్నికల ప్రక్రియ ఏడాదిన్నర కిందట ప్రారంభమైంది. ముందుకు సాగకుండా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నించారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారు. చివరికి పోలింగ్‌ జరిగాక ఓట్ల లెక్కింపునూ ఆరు నెలలపాటు వాయిదా వేయించారు. ఈ ఎన్నికలన్నీ ఏడాదిన్నర కిందటే పూర్తయి, ఈ ప్రజాప్రతినిధులు అప్పటి నుంచీ అందుబాటులో ఉండి ఉంటే.. కొవిడ్‌ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే వారన్న ఇంగితజ్ఞానం ప్రతిపక్షానికి లేకుండాపోంది’ అని సీఎం జగన్‌ విమర్శించారు.

ఇదీ చదవండి..

BJP LEADERS MEET GOVERNOR: గవర్నర్​ను కలవనున్న భాజపా నేతలు.. తితిదే బోర్డు నియామకంపై ఫిర్యాదు..

Last Updated :Sep 21, 2021, 4:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.