కోనసీమ జిల్లాకు అంబేడ్కర్​ పేరు.. త్వరలో కీలక నిర్ణయం !

author img

By

Published : Jun 21, 2022, 7:40 PM IST

CM Jagan on Konaseema Issue

CM Jagan News: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పినిపె విశ్వరూప్​తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. కోనసీమ జిల్లాకు అంబేడ్క​ర్​ పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

CM Jagan on Konaseema Issue: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్​ పేరు ఉంచాలా..? లేదా అనే విషయంపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె. రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పినిపె విశ్వరూప్​తో.. ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోనసీమ అల్లర్లు, తదనంతరం తీసుకున్న చర్యలపై సీఎంతో చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిల్లో కోనసీమకు అంబేడ్క​ర్​ పేరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్​ పేరు మార్పులకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్​పై అభ్యంతరాల గడువు ఇప్పటికే పూర్తైంది. అయితే.. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయమై సీఎం సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

Notification: కోనసీమ జిల్లా పేరును డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రాథమిక నోటిఫికేషన్‌ మే 18న విడుదల చేసింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. పేరు మార్పుపై జూన్​ 18వ తేదీలోగా అభ్యంతరాలు, సూచనలు కలెక్టర్‌కు తెలపాలంటూ ప్రాథమిక నోటిఫికేషన్​లో తెలిపింది.

ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్​ విడుదల చేసిన తర్వాత కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు.

'కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు' అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. లాఠీలతో చెదరగొట్టారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.