ఆగస్టు 15న.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

author img

By

Published : Jul 31, 2022, 2:09 PM IST

Updated : Aug 1, 2022, 3:30 AM IST

KISHAN REDDY

KISHAN REDDY: 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా.. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. జాతీయ పతాకం స్ఫూర్తిని బలంగా చాటాలన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేళ.. ఆగస్టు రెండో తేదీన దిల్లీ వేదికగా పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం

KISHAN REDDY: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోస్టాఫీసుల్లో జెండాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నాటి త్యాగధనుల గొప్పతనం గురించి నేటితరం తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల నిర్వహణపై ఆగస్టు 6న ధిల్లీలో ప్రధాని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మహోత్సవాల నిర్వహణలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేస్తున్నాం. ఆగస్టు 3న దిల్లీలో మోటారు సైకిల్‌ యాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. 9 నుంచి 13 వరకు ప్రభాత భేరి పేరుతో ప్రతి పల్లె, పట్టణం, నగరాల్లో ప్రదర్శనలుంటాయి. దేశ విభజన సందర్భంగా 1947 ఆగస్టు 14న పెద్ద ఎత్తున మారణ హోమం జరిగింది. 10 లక్షల మందికిపైగా ఊచకోతకు గురయ్యారు. వీరికి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తవుతాయి. వచ్చే పాతికేళ్లు మనదేశానికి బంగారు ఘడియలు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలి. ఆగస్టు 9వ తేదీ నుంచి ర్యాలీలు జరపాలి. మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయాలి. ఆగస్టు 15న వాటికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించాలి. జెండాలపై ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నందున ఖాదీ ద్వారా అన్నింటి తయారీ సాధ్యం కాదు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

పింగళిని మరిస్తే దేశం క్షమించదు: ఎందరో మహానుభావులు మనకు స్వాతంత్య్రం తెచ్చినా మువ్వన్నెల పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య వంటి మహనీయుణ్ని మరిస్తే దేశం క్షమించదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి స్వగ్రామమైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రును ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 2న దిల్లీలో పింగళి శత జయంతి వేడుకలను ఆయన కుటుంబీకుల మధ్య నిర్వహించాలని ప్రధాన మంత్రి సంకల్పించారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పింగళి స్మారక తపాలా స్టాంపును ఆవిష్కరిస్తారని చెప్పారు. గ్రామంలో రహదారులతోపాటు కూచిపూడి నుంచి భట్లపెనుమర్రు మీదుగా కనుమూరు వరకు తారురోడ్డు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గ్రామంలో స్థలం కేటాయిస్తే వెంకయ్య స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. 18 కోట్ల జాతీయ పతాకాలను కేంద్ర సాంస్కృతికశాఖ నుంచి అందిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున పింగళి మనవరాలు సుశీలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కోరారు.

జేసీపై కేంద్రమంత్రి అసహనం: గ్రామస్థుల సమస్యలపై మాట్లాడే సమయంలో జేసీ మహేష్‌కుమార్‌ కనిపించకపోవడంతో ఆయన ఎక్కడని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వెళ్లిపోయారని ఆర్డీవో విజయకుమార్‌ చెప్పడంతో ‘అంత బిజీనా?’ అంటూ అసహనం వ్యక్తపరిచారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 1, 2022, 3:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.