కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.. అవి ఏంటంటే..?

author img

By

Published : May 12, 2022, 8:06 PM IST

Updated : May 13, 2022, 4:33 AM IST

కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్​ను ముందుగానే ప్రారంభించాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నామని మంత్రులు వెల్లడించారు. గతంలోకంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. మడకశిర నియోజకవర్గంలో ఏపీఐఐసీకి 100 ఎకరాలు కేటాయించామన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి అంబటి అన్నారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలోకంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. గోదావరి డెల్టాకు జూన్‌ 1 నుంచి ధవళేశ్వరం నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. ముందస్తు వ్యవసాయ సీజన్‌కు రైతులు సమాయత్తం కావాలని సూచించారు.

"ఏటా గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. జూన్‌ 10 నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తాం. పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల. పట్టిసీమపై ఆధారపడకుండానే నీరు ఇవ్వొచ్చు. నాగార్జునసాగర్‌ నుంచి జులై 15 నుంచి నీరు విడుదల. ఇతర ప్రాజెక్టుల నుంచి జులై 15 నుంచే నీరు విడుదల. రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జులై 30 నుంచి నీరు విడుదల. ఖరీఫ్‌ సీజన్‌ ముందే ప్రారంభిస్తే.. ముందే పంట చేతికి వస్తుంది. నవంబర్‌లో తుపానులు వచ్చేనాటికే పంట చేతికి వస్తుంది. రైతులు కూడా మూడు పంటలు వేసుకోవచ్చు. గతంలో ప్రాజెక్టులు నిండాక ఆగస్టులో నీరు ఇచ్చేవారు." -అంబటి రాంబాబు, మంత్రి

సంక్షేమ పథకాలకు ఒక క్యాలెండర్‌ రూపొందించి పాటిస్తున్నామని మరో మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈనెల 19న యానిమల్‌ అంబులెన్స్‌ ప్రారంభిస్తామని తెలిపారు. జూన్‌ 6న వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మడకశిర నియోజకవర్గంలో ఏపీఐఐసీకి 100 ఎకరాలు కేటాయింపు చేశామన్నారు. రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

మంత్రివర్గం నిర్ణయాలు ఇవీ...

* పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే నిర్మాణం పూర్తవడంతో రివర్‌ స్లూయిస్‌ గేట్లతో ఆ నీటిని ధవళేశ్వరం బ్యారేజికి విడుదల చేసి గోదావరి డెల్టా ఆయకట్టుకు జూన్‌ 1 నుంచి నీరు.

* పులిచింతల జలాశయంలో 36 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ నీటిని ప్రకాశం బ్యారేజికి విడుదల చేసి కృష్ణా ఆయకట్టుకు జూన్‌ 10 నుంచి నీళ్లు. పట్టిసీమ అవసరం లేకుండానే ఈసారి ముందస్తుగానే సాగు నీరు.

* నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోనూ నీళ్లున్నాయి. సాగర్‌ ఆయకట్టుకూ జులై 15 నుంచి సాగునీరు. సోమశిలపై ఆధారపడ్డ వాళ్లందరికీ జులై 10 నుంచి నీళ్లు. సోమశిలలో 70 టీఎంసీల నీటి నిల్వలకు అవకాశం ఉండగా ప్రస్తుతం 56 టీఎంసీలున్నాయి.

* ఎస్‌ఆర్‌బీసీ కింద గోరకల్లు, అవుకు జలాశయాల నుంచి జూన్‌ 30 నుంచి ఆయకట్టుకు నీరు.

* జూన్‌ 10న గండికోట, బ్రహ్మంసాగర్‌, చిత్రావతి, వెలిగల్లు జలాశయాల నుంచి నీటి విడుదల.

* ఉత్తరాంధ్రలోని తోటపల్లి, గొట్టా బ్యారేజి, వంశధార కింద ఆయకట్టుకు నీరు ఎప్పుడు ఇచ్చేదీ తర్వాత నిర్ణయం.

* ఖరీఫ్‌ ముందుగా ప్రారంభం కావడంతో 3 పంటల సాగుకు అవకాశం ఉంటుంది. తుపాన్ల నుంచి రక్షణ ఉంటుంది. మూడో పంటలో పంట మార్పిడికి ఆస్కారం ఉంటుంది.

2 నెలల సంక్షేమ క్యాలెండర్‌

మే, జూన్‌ నెలలకు సంబంధించిన సంక్షేమ క్యాలెండర్‌ను మంత్రివర్గం ఆమోదించింది. శుక్రవారం (13న) ముమ్మిడివరంలో సీఎం ఆధ్వర్యంలో మత్స్యకార భరోసా. మే 16న వైఎస్సార్‌ రైతు భరోసా. ఆ రోజు రూ.5,500 చెల్లిస్తారు. మే 31న ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద రూ.2,000 రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. మే 19న విజయవాడలో సంచార పశువైద్య సేవ అంబులెన్సుల ప్రారంభం.

* జూన్‌ 6న 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో 3వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీ. జూన్‌ 14న వైఎస్సార్‌ పంటల బీమా పరిహారం పంపిణీ. 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన పంటలకు బీమా సొమ్ము అందజేత. జూన్‌ 21న అమ్మ ఒడి సాయం పంపిణీ.

* నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎంఆర్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ప్రాంగణంలో మాజీ మంత్రి గౌతంరెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.

* ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు.

ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక లబ్ధి

గడప గడపకూ ప్రభుత్వంపై మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగిందని వేణుగోపాలకృష్ణ చెప్పారు. నవరత్నాలు ఎలా అమలు చేస్తున్నామో ఇంటింటికీ వెళ్లి చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిపారు. 8 నెలల సమయం తీసుకుంటున్నాం. మరో నెల ఆలస్యమైనా ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం సూచించినట్లు వివరించారు.

మరికొన్ని నిర్ణయాలు..

* పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు.. 26 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టులకు ఆమోదం.

* వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, రైతుబజార్లు, ప్రాసెసింగ్‌ సదుపాయాలు, మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం.

* కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీహెచ్‌సీగా (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌) మార్చేందుకు ఆమోదం. 38 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం.

* మార్క్‌ఫెడ్‌లో 8 డిప్యూటీ మేనేజర్లు, 22 మంది అసిస్టెంటు మేనేజర్లను నియమించనున్న మార్క్‌ఫెడ్‌.

* 2022-23 ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి ఆమోదం. ఏపీ లాజిస్టిక్స్‌ విధానానికి ఆమోదం.

* నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువుల బదులు బయో ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తామన్న క్రిభ్‌కో. మంత్రిమండలి ఆమోదం.

* లోకాయుక్తలో 16 పోస్టులకు ఆమోదం.

* పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ.

భూ కేటాయింపులు

* ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్‌ తరహాలో అత్యాధునిక ఆసుపత్రుల హబ్‌లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఇలాంటివాటి ఏర్పాటుకు ప్రైవేటు రంగం ముందుకు రావాలని ప్రభుత్వం గతంలో పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మచిలీపట్నంలో ఆసుపత్రికి ఎకరా భూమి, ఒంగోలు మండలం ముక్తి నూతలపాడులో ఎకరా, నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరులో 4 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం. వైయస్‌ఆర్‌ జిల్లా చినమాచిపల్లిలోనూ ఇలాంటి ఆసుపత్రికి 3 ఎకరాల భూమి కేటాయింపు.

* సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు, పడమట కండ్రిగ గ్రామాల్లో టెక్స్‌టైల్‌ పార్కుకు 11.9 ఎకరాలు.

* పెనుకొండ డివిజన్‌ మడకశిర మండలంలో పారిశ్రామిక పార్కు కోసం 235 ఎకరాలు. మరో 63.1 ఎకరాలు ఇదే గ్రామంలో కేటాయింపు.

* మడకశిర మండలం గౌడనహళ్లిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, మినరల్స్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ పార్కుల కోసం వరుసగా 318.44 ఎకరాలు, 192.8 ఎకరాలు.

* పెనుగొండలో మెగా స్పిరిట్యువల్‌ కేంద్రం ఏర్పాటుకు 40.4 ఎకరాలు.

* తిరుపతి జిల్లాలో తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్‌ పార్కుకు 41.77 ఎకరాలు.

* అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్టు కోసం 10.50 ఎకరాలు.

* కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్టుల నిర్మాణం కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాల భూమి.

* విశాఖపట్నం జిల్లా యండాడలో కాపు భవన్‌కు 50 సెంట్ల స్థలం.

* బాపట్ల జిల్లా అద్దంకిలో చెత్తశుద్ధి ప్లాంటు, కంపోస్టు యార్డుకు 19 ఎకరాలు. నంద్యాల జిల్లా యాపిలిలో హార్టికల్చర్‌ మార్కెట్‌ కాంప్లెక్సు కోసం 25.93 ఎకరాలు.

* బాపట్ల జిల్లా రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు. సవరించిన సరిహద్దులకు ఆమోదం.

* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అగ్రికల్చర్‌ కంపెనీకి చెందిన 1754.49 ఎకరాల భూమి అనుభవిస్తున్న లీజుదారులకు హక్కులు కల్పిస్తూ నిర్ణయం. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మినహాయిస్తూ నిర్ణయం. ఎకరా 100 రూపాయలకు భూమి. వెయ్యి మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయం.

గడప గడప కార్యక్రమానికి వెళ్లకపోతే ఎలా?

మంత్రులతో సీఎం జగన్‌

‘ప్రజల వద్దకు వెళ్లాల్సింది మీరు.. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సింది మీరు.. ప్రజలు ఓట్లు వేయాల్సింది మీకే కదా? గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి మీరు వెళ్లకుండా మీ మనుషులను పంపడమేంటి?’ అని మంత్రులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా గడప గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత గురువారం తొలిసారి కేబినెట్‌ భేటీ జరిగింది. ఎక్కువ మంది మంత్రులు కొత్తవారు కావడంతో ఎజెండా అంశాలపై చర్చ ముగిసి, అధికారులు బయటకు వెళ్లిపోయాక మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి తాను ఎందుకు ప్రాధాన్యమిస్తున్నాననే విషయాన్ని ఆయన వివరించినట్లు తెలిసింది. ‘ఇంటింటికీ వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం వారికి ఏం చేసిందో వివరాలతో సహా చెప్పాలి. ఎవరైనా ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే వారికి విధిగా సమాధానం చెప్పండి. అడిగేవారికి ప్రభుత్వం ఏమేం ఇచ్చిందో వివరించండి. తెదేపా మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారితోనూ మాట్లాడండి. వారిళ్లలోనూ ప్రభుత్వం ఏమేం ఇచ్చిందో చెప్పండి. ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని వెళ్లాల్సిందే. పార్టీ సమన్వయ కర్తలు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. పార్టీ ఉంటేనే మనమంతా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి. మంత్రులు ఇన్‌ఛార్జులుగా ఉన్న జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో పర్యటించాలి’ అని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి :

Last Updated :May 13, 2022, 4:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.