'అగ్నిపథ్‌'పై పెల్లుబికిన ఆగ్రహం.. ఉద్రిక్తతలకు దారితీసిన ఆందోళనలు

author img

By

Published : Jun 18, 2022, 9:44 PM IST

'అగ్నిపథ్‌'పై పెల్లుబికిన ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం..సైనిక నియామాకల కోసం చేపట్టిన అగ్నిపథ్‌పై..రాష్ట్రంలోనూ అభ్యర్థులు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన చేపట్టాయి. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

'అగ్నిపథ్‌'పై పెల్లుబికిన ఆగ్రహం

అగ్నిపథ్‌ రద్దు చేయాలంటూ.. వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు అరెస్టులకు దారితీశాయి. విశాఖలో అల్లర్లను అరికట్టేందుకు ముందస్తు చర్యగా.. రాష్ట్ర నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్‌ని రద్దు చేయాలనే డిమాండ్‌తో విశాఖ రైల్వే స్టేషన్‌కి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రైల్వే స్టేషన్‌ ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో నిరసనకారుల ప్రయత్నం విఫలమైంది.

కడప కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని, వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. ఐనా వెనక్కి తగ్గగపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అగ్నిపథ్‌ను విరమించుకోవాలని.. అనంతపురంలో ఏఐఎస్​ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేయగా.. విద్యార్థి సంఘం నేతలు కార్యాలయం వైపు దూసుకెళ్లారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

సత్య సాయి జిల్లా హిందూపురంలో ఏఐఎస్​ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‌ధర్నా చేపట్టారు. మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ని వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఏఐఎస్​ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.