CBN LETTER TO CM: 'వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా జంబో పాలకమండలి.. భవిష్యత్‌లో పశ్చాత్తాపం తప్పదు'

author img

By

Published : Sep 17, 2021, 10:25 AM IST

Updated : Sep 17, 2021, 12:42 PM IST

CBN LETTER TO CM

తితిదే నూతన పాలకమండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వెంకన్న ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. వ్యాపార ధోరణితో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని ఆరోపించారు. పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. తితిదేకు సంబంధించి ప్రభుత్వ చర్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. వ్యాపార ధోరణితో, రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీకని.. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరమని ఆక్షేపించారు.

ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని చంద్రబాబు సూచించారు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించడాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తేల్చిచెప్పారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన తితిదేకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయమన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం జరగలేదన్నారు. ఈ జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. స్వామిపై భక్తి భావంతో, స్వామివారి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యమివ్వకుండా .. కొంతమంది వ్యక్తుల సేవలో మునిగి తేలే వారికే అవకాశం ఇచ్చారని ఆరోపించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో జంబో బోర్డు ఏర్పాటు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులను సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను కించపరిచారని మండిపడ్డారు. సామాన్య భక్తుల దర్శనాలకు రకరకాల నిబంధనలు విధించి.. వీఐపీల సేవలో తరించే విధానాన్ని ప్రస్తుతం చూస్తున్నామని విమర్శించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయాలను గాలికొదిలేసి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించి బోర్డు పవిత్రతను దెబ్బతీశారని ఆక్షేపించారు. గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత , ప్రాశస్త్యం దెబ్బతింటుందని.. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.

భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తిరుమల ప్రతిష్టను కాపాడాలని.. తిరుమల తిరుపతి సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.

చంద్రబాబు లేఖ
చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి: AP Cabinet: కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..అవి ఏంటంటే..

Last Updated :Sep 17, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.