మరణం మిగిల్చిన సందేహాలు.. భర్తను హింసించి చంపేశారని భార్య ఆరోపణ

author img

By

Published : Jul 19, 2022, 9:18 AM IST

death

నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ (38) అనుమానాస్పద మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్మాగారం యజమాని వంశీనాయుడు తన భర్తను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని మృతుడి భార్య ఆరోపించింది.

నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ (38) అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేసి చంపేశారని, ఆ హత్యోదంతం వెలుగు చూడకుండా ఉండేందుకే ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి తొలి నుంచీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వీటికి మరింత బలం చేకూర్చేలా ఉంది. బాధ్యుడైన ఎస్సైని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులపై జిల్లా మంత్రి ఒత్తిడి తెచ్చి ఈ వ్యవహారమంతా నడిపించారని ప్రతిపక్ష తెదేపా ఆరోపిస్తోంది.

చంపేశారని ఆరోపిస్తే..
* తన భర్తది ఆత్మహత్య కాదని.... పొదలకూరు ఎస్సై కరీముల్లా, ఇటుకల కర్మాగారం యజమాని వంశీనాయుడు కలిసి కొట్టి చంపేశారని, ఆ తర్వాత మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారని మృతుడి భార్య పద్మావతి ఆరోపించినా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. నారాయణది ఆత్మహత్యగానే పేర్కొంటూ సీఆర్‌పీసీ 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.
* ఆ తర్వాత.. ఇటుకల కర్మాగారం యజమాని వంశీ నాయుడు అతన్ని ఆత్మహత్యకు పురికొల్పాడని, ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడని పేర్కొంటూ సెక్షన్లు మార్చారు.
* జూన్‌ 19న మృతి చెందితే 21 వరకూ పోస్టుమార్టం నిర్వహించలేదు. తెదేపా సహా ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ సంఘాల నాయకుల ఆందోళన తర్వాతే చేశారు.
* నారాయణ మర్మాంగాలు, ఛాతీపై ఉన్న గాయాల విషయాల్ని పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించలేదు.

ఎస్సై కరీముల్లాను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
* మృతుడి భార్య ఫిర్యాదు చేసినా సరే ఎస్సై కరీముల్లాపై కేసు నమోదు చేయలేదు?
* మృతదేహాన్ని పూడ్చిపెట్టనీయకుండా.. 40 మంది పోలీసులు దగ్గరుండి దహనం చేయించారు? రీ పోస్టుమార్టం చేస్తే కొట్టడం వల్ల అయిన గాయాలు వెలుగు చూస్తాయనే దహనం చేయించారనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఆధారాల్ని ధ్వంసం చేయడమేనని అంటున్నారు.
* జూన్‌ 19వ తేదీ ఉదయం 7 గంటలకు నారాయణపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. కానీ ఆయనను 17, 18 తేదీల్లో పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. 19న సాయంత్రం అటవీ ప్రాంతంలో నారాయణ చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు.

నన్నూ చంపేస్తారేమో: "వంశీ నాయుడు, ఎస్సై కరీముల్లా కలిసి నా భర్తను చంపేశారు. ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఆనవాళ్లేమీ లేవు. పోస్టుమార్టం చేసిన తర్వాత నుంచి 15 రోజుల వరకూ ప్రతి రోజూ పోలీసులు వచ్చి నాతో అనేక తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని వెళ్లారు. ఇవేంటని అడిగితే.. చెప్పింది చేయి.. లేదంటే అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వే నీ భర్తను చంపేశావని కేసులో ఇరికిస్తామని బెదిరించారు. నా భర్తను కొట్టి చంపేసినట్లే నన్నూ చంపేస్తారేమోనని భయంగా ఉంది."- పద్మావతి, నారాయణ భార్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.