Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ వీడియో వైరల్.. స్పందించిన ఎంపీ

author img

By

Published : Aug 4, 2022, 7:39 PM IST

Updated : Aug 5, 2022, 6:24 AM IST

GORANTLA MADHAV

Video Viral: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పందించారు. తాను జిమ్‌ చేసేటప్పటి వీడియోలను మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశారని.. అది ఫేక్‌ వీడియో అని.. తనను డ్యామేజ్‌ చేసి ఇబ్బంది పెట్టేందుకు తెదేపా వాళ్లు చేస్తున్న కుట్రగా ఆయన ఆరోపించారు.

GORANTLA MADHAV: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి రాష్ట్రంలో గురువారం కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై గోరంట్ల స్పందన

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారశైలి తొలి నుంచి వివాదాస్పదమే. ఆయన అనంతపురంలో సీఐగా పనిచేస్తున్నప్పుడు సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికెళ్లినా, ఎవరితో మాట్లాడినా నోటిదురుసు ప్రదర్శిస్తారనేది ఆయనపై ప్రధానమైన విమర్శ. తెదేపా ప్రభుత్వంలో సీఐగా యూనిఫాంలో ఉండగానే జేసీ దివాకర్‌రెడ్డిని సవాల్‌ చేస్తూ మీసం మెలేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయనకు వైకాపా హిందూపురం ఎంపీ టికెట్‌ ఇచ్చింది. కియా పరిశ్రమ ప్రారంభోత్సవ సమయంలోనూ ఆ సంస్థ ఎండీ వైపు చూపుడువేలు చూపిస్తూ బెదిరించిన విషయం తెలిసిందే. పరిశ్రమ నుంచి విడుదలైన మొదటి కారుపై సంతకాలు చేసే సమయంలోనూ కియా గురించి వ్యతిరేకంగా వ్యాఖ్య రాయడం వివాదంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాధవ్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయనపై మొత్తం రెండు కేసులున్నాయి. అత్యాచారం, హత్య, నేరపూరిత బెదిరింపు వంటి అభియోగాలతో ఆయనపై కర్నూలు జిల్లాలో ఓ కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా ఆయనపై అభియోగాలున్నాయి. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని.. బెదిరించారని, నాలుక కోసేస్తానంటూ హెచ్చరించారన్న ఫిర్యాదుపై 2019లో తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

నాపై కుట్ర: ఎంపీ మాధవ్‌
తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు తెదేపా కుట్ర చేస్తోందని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. దిల్లీ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో తనకు చెందినదంటూ ఓ చెత్త వీడియోను చింతకాయల విజయ్‌ (అయ్యన్నపాత్రుడి కుమారుడు), పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు విడుదల చేశారన్నారు. ఆ వీడియోపై నిజానిజాలు తేల్చి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. వీడియో వాస్తవికతను తేల్చేందుకు ఫోరెన్సిక్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 5, 2022, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.