1145 టీచర్ పోస్టుల రద్దు.. నిరుద్యోగుల్లో ఆందోళన

author img

By

Published : Sep 18, 2022, 8:35 AM IST

Updated : Sep 18, 2022, 11:22 AM IST

Etv Bharat

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో కొత్తగా నియామకాలు చేపట్టకపోగా ఉన్న పోస్టులను రద్దు చేస్తోంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చేందుకు బడుల పర్యవేక్షణ పెంచేందుకు కొత్తవి మంజూరు చేయాలి. కానీ ఆర్థికంగా భారం పడకుండా ఉండేందుకు, ఖాళీగా ఉన్న పోస్టులకు మంగళం పాడుతోంది. రద్దయిన చోట భవిష్యత్తులో ఎలాంటి నియామకాలు ఉండవు.

పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు మండల విద్యాధికారుల్ని నియమిస్తామని ఇటీవల ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అదనంగా పోస్టులు వస్తున్నాయని అందరూ భావించగా.. వాటి మంజూరు కోసం ఇప్పటికే ఉన్న పోస్టులను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులను ఏర్పాటు చేసేందుకు 1,145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయి. గతేడాది అక్టోబరులో 5అదనపు డైరెక్టర్ల కోసం 15 పోస్టులను తొలగించారు. ఇలా ఇప్పటివరకు 1,160 పోస్టులను రద్దు చేశారు. ఇక మిగిలినవి 840 మాత్రమే. వీటిల్లో సుమారు 350 పోస్టుల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో ప్రాధాన్యమిచ్చిన ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులను ప్రభుత్వం రద్దు చేయడంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స ఒక్క పోస్టు రద్దు కాదు. ఎక్కడా ఒక్క పాఠశాల మూతపడదు అని స్పష్టం చేసినా, అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ పోస్టులు రద్దు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 5,742మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిని ఒప్పంద, పార్ట్‌టైం ప్రాతిపాదికన నియమించారు. నెలకు రూ.14,203 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌ వీరందర్నీ అర్హతలు, సర్వీసు పరిగణనలోకి తీసుకొని క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చారు. దానికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ ఇప్పుడు పాఠశాలల్లో ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ పోస్టుల్ని రద్దు చేస్తున్నారు. అసలు పోస్టులే లేకపోతే తమను ఎలా క్రమబద్దీకరిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ ఉపాధ్యాయులు చిత్రలేఖనం, టైలరింగ్, క్రాఫ్ట్, హ్యాండ్లూమ్‌ వీవింగ్, హెల్త్, మ్యూజిక్, డ్యాన్స్, కంప్యూటర్, వృత్తి విద్య కోర్సులను నేర్పిస్తారు. పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు చదువుతోపాటు అదనపు నైపుణ్యాలను అందించాలి. ఎన్‌ఈపీలోనూ ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎన్‌ఈపీని సమర్థంగా అమలు చేస్తున్నామని చేప్పే ప్రభుత్వం ఇప్పుడు అందులోని ముఖ్య అంశాలను గాలికొదిలేస్తోందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.

టీచర్ పోస్టుల రద్దు

ఇవి చదవండి:

Last Updated :Sep 18, 2022, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.