తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీ ఉద్రిక్తం

author img

By

Published : Sep 19, 2022, 9:39 AM IST

tdp leaders

తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్‌ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. మందడం నుంచి ఎడ్ల బండ్లపై నిరసన ర్యాలీ చేపట్టాలని తెదేపా నేతలు నిర్ణయించుకున్నారు.

రైతు సమస్యలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మందడం గ్రామం నుంచి అసెంబ్లీ వరకూ ఎడ్ల బళ్లపై ర్యాలీగా వెళ్లాలని తెదేపా నేతలు నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను గృహనిర్భందం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్‌ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్టు చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అసెంబ్లీ పరిసరాల బయట ఉద్రిక్తత నెలకొంది. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని లాక్కుంటూ నేతలు వెళ్లారు.

bull carts
పోలీస్​స్టేషన్​లో ఎడ్ల బండ్లు

తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుని కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామని తేల్చిచెప్పారు.ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు. అంతకుముందు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు.

tdp leaders
నిరసన తెలుపుతున్న తెదేపా నేతలు
పోలీస్ స్టేషన్ నుంచి ఎడ్ల బళ్లను తీసుకుంటూ రోడ్డుపైకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకువచ్చారు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యేలే కాడి తగిలించుకుని బండిని లాగారు. ఎడ్ల బళ్లపై పోలీసు ప్రతాపం ఏమిటంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. 3ఏళ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వాపోయారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. పశువుల పట్ల కూడా ప్రభుత్వానికి కనికరం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు సమస్యల పట్ల నిరసనను కూడా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతు ద్రోహి జగన్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.