Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే

author img

By

Published : Nov 16, 2021, 2:24 PM IST

Updated : Nov 17, 2021, 4:50 AM IST

the-ongoing-hearing-in-the-high-court-on-the-capital-amravati-cases

రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో రెండో రోజు విచారణ ముగిసింది. రాజధాని కోసం జీవనోపాధిని త్యాగం చేసిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని అని గుర్తు చేశారు. తదుపరి వాదనలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరిదీ అని హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మంగళవారం వ్యాఖ్యానించారు. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో.. భూములిచ్చిన రైతులకో మాత్రమే సంబంధించినది కాదన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులకే భారతదేశం సొంతం కాదని, అది దేశ ప్రజలందరిదీ అని గుర్తుచేశారు. అదే విధంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకే అమరావతి పరిమితం కాదని కర్నూలు, విశాఖపట్నం వాసులు సహా రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుందన్నారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. రాజధాని నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక హక్కులు ఉంటాయని, వారిని ప్రత్యేక తరగతిగా చూడాలన్న నేపథ్యంలో సీజే పైవిధంగా స్పందించారు. సీనియర్‌ న్యాయవాది స్పష్టత ఇస్తూ.. మూడు రాజధానుల నిర్ణయంతో భూములిచ్చిన రైతుల, వారి భవిష్యత్తు తరాలు నష్టపోతాయన్నారు. హక్కులను రక్షించే క్రమంలో వారి త్యాగాలను ప్రత్యేకంగా చూడాలనేది తన ఉద్దేశం అన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొందరు రైతులు దాఖలుచేసిన వ్యాజ్యాలపై సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ రెండోరోజు మంగళవారం వాదనలు వినిపించారు. కొనసాగింపునకు విచారణ బుధవారానికి వాయిదా పడింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

మూడు రాజధానుల నిర్ణయం రాజ్యాంగ వంచన

సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘అధికరణ 3, 4లను అనుసరించి పార్లమెంటు ఏపీ విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక చేయాలని నిర్దేశించింది. ఆ ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి, చట్టం చేయడానికి వీల్లేదు. ఆ నిర్ణయం రాజ్యాంగ వంచన లాంటిదే.

* అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతులు, స్థానిక సంస్థల ప్రమేయం లేకుండా బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) మార్చడానికి వీల్లేదు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం మౌలిక వసతులు, నిర్మాణాలు నిర్దిష్ట సమయంలో పూర్తిచేయాలి. ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. భూ సమీకరణ పథకం ఖరారైన ఏడాదిలోపు అభివృద్ధి చేసిన ప్రాంతంలో రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. అమరావతి అభివృద్ధిలో జాప్యం వల్ల భూముల విలువ క్షీణించింది. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చి ఉద్దేశపూర్వకంగా అమరావతిలో భూముల విలువ తగ్గేలా చేసింది.

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నతస్థాయి కమిటీ వ్యవహరించింది

అమరావతి సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటుచేసిన మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి కోర్టు ధిక్కరణకు పాల్పడింది. అభ్యంతరాలు సమర్పించేందుకు 2020 జనవరి 20వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తున్నట్లు అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. అందుకు విరుద్ధంగా ఉన్నతస్థాయి కమిటీ జనవరి 17నే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందువల్ల ఆ నివేదిక చెల్లుబాటు కాదు. నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లవు.

* ఏపీ సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్న అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తామని ‘అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (ఏఎంఆర్‌డీఏ) చట్టంలో పేర్కొన్నా అది కంటితుడుపు చర్య మాత్రమే. అథార్టీ మాస్టర్‌ ప్లాన్‌ మార్చుకునేందుకు అందులో వీలు కల్పించారు.

* మూడు రాజధానుల విషయంలో ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోడానికి సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను తీసుకొచ్చారు.

* అమరావతిపై దుష్ప్రచారం చేసేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేశారు. వీటిపై కేసులను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థించింది.

* విభజన తర్వాత ఏపీ కొత్త రాజధానికి కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించింది. వాటితో కొన్ని నిర్మాణాలు జరిపారు. ఈ దశలో రాజధానుల తరలింపు నిర్ణయం సరికాదు.

* విజయవాడలో భూములకు తక్కువ మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకొని లెక్కించినా.. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో రూ.33వేల కోట్ల సంపద ఆవిరైంది.

* భూసమీకరణ పథకం ద్వారా భూములిచ్చిన రైతులకు దఖలుపడ్డ హక్కులకు మూడు రాజధానుల నిర్ణయంతో విఘాతం కలిగింది.

'30 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని. అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ. స్వాతంత్య్ర సమరయోధులు తమ కోసమే పోరాడలేదు.. దేశ ప్రజలందరి కోసం పోరాడారు' - హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

ఆత్మను వేరు చేయడమే...

రాజధాని కేసులపై సోమవారం నుంచే రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని ప్రస్తావించారు. ఏపీ విభజన చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ కమిటీ అధ్యయనంలో 52 శాతం ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య, 10.72 శాతం మంది విశాఖపట్నం వద్ద రాజధానికి మద్దతు తెలిపారన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. మూడు రాజధానుల శాసనం చేసే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం చేసి చట్టబద్ధంగా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను కోర్టు.. మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

700వ రోజుకు అమరావతి మహోద్యమం.. 16వ రోజు మహాపాదయాత్ర

Last Updated :Nov 17, 2021, 4:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.